కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల సంగతి ఎలా ఉన్నా, ఆ పార్టీ టిక్కెట్లకు మాత్రం గ్యారెంటీ లేకుండాపోయింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఒకరిద్దరు అభ్యర్థులకు టిక్కెట్లు ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించినవారికి కూడా నామినేషన్ దాఖలు చేసి, బీ ఫామ్ ఇచ్చేవరకు అది ఉంటుందో, ఊడుతుందోనన్న టెన్షన్ పట్టుకున్నది. సికింద్రాబాద్ అభ్యర్థిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఏమైందో ఏమో కానీ దానం నాగేందర్‌కు బదులు తిరిగి బొంతు రామ్మోహన్ పేరు పరిశీలిస్తునట్టు సమాచారం. వాస్తవానికి సికింద్రాబాద్ టికెట్ హామీతోనే బొంతు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కానీ, అనూహ్యంగా దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో సికింద్రాబాద్ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం దానంకు బదులు బొంతు రామ్మోహన్‌ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
పాపం పైసల్ లేవంట!
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయమని ఆఫర్ వచ్చినా డబ్బు లేకనే తిరస్కరించినట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. పైసల మంత్రి వద్ద పైసలు లేవా? అని సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్లు వెల్లువెత్తాయి. నిజమే అయి ఉండవచ్చు. పైసలకు కటకట ఉండటం వల్లనే చెన్నైలో ఆమెనే స్వయంగా కూరగాయల మార్కెట్‌కు వెళ్లి బేరమాడి మరీ కొనుకుంటున్న దృశ్యాలను మీడియాలో చూశాం. తమిళనాడులో మహిళా నేతల పరిస్థితి అలానే ఉందేమో అన్నట్టుగా, తాజాగా మన రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై కూడా తన వద్ద డబ్బులు లేకనే గతంలో ఆరు సార్లు ఓడిపోయినట్టు వాపోయారు. కానీ, ఆమె ఎన్నికల ఆఫిడవిట్లో ప్రకటించిన ఆస్తులు చూస్తే డబ్బులు లేవంటే నమ్మేటట్టు లేదు. ఇదో రకమైన సింపతి సెంటిమెంట్ ఎత్తుగడేమో.
క్యా బాత్ హై !
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా వారి సర్కార్ ఇంకా గాడిన పడలేదు. ఈ మాట ఏ బీఆర్ఎస్సో, బీజేపీ నాయకుడో అన్నాడంటే, ప్రతిపక్షాలు కదా ఆ మాత్రం అనవా అని లైట్ తీసుకోవచ్చు. కానీ సాక్ష్యాత్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తనకు ఎదురైన ఒక ఉదంతాన్ని మీడియాతో పంచుకొని వాపోయారు. తనకు తెలిసిన బాధితుడు ఒకరు సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) సహాయం కోసం వస్తే.. ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ రికమండేషన్ లెటర్‌తో దరఖాస్తు పంపించారట. అయితే అదిప్పుడు ఎక్కడుందో తెలియడం లేదు. కనీనం రశీదు కూడా ఇవ్వలేదు. దరఖాస్తుకు బాధితుడు జతపరిచిన ఒరిజినల్ బిల్లులు పోతే పరిస్థితి ఏమిటి? దీన్ని బట్టి సీఎం కార్యాలయంలో ఇప్పటికీ సీఎంఆర్ఎఫ్ ఫండ్ వ్యవస్థ ఉందో? లేదో? తెలియడం లేదని నిరంజన్ వాపోయారు.
ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ!
ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ కేశవరావు తన ఫ్లాష్‌బ్యాక్ చెప్పుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, తాను చెప్పడం వల్లనే అప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారని ఆయన కుమారుడు విప్లవ్‌కుమార్ అన్నారు. మరి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరమని ఇప్పుడు ఎవరు చెప్పారు? అని అడిగితే.. తన కుతూరు విజయలక్ష్మి అని చెప్తారేమో. మొత్తం మీద ఆయన తన ఇంట్లో కుమారుడు, కూతురిని సమానంగా చూస్తూ వారి మాటకు విలువ ఇస్తున్నట్టు ఉంది. ఇంతకు ఎవరో ఒకరు చెప్తే తప్ప కేకే సొంతంగా నిర్ణయాలు తీసుకోరా? అన్నదే అసలు పాయింట్.
– వెల్జాల