PM Kusum | హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : పీఎం కుసుమ్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ల ధరలను ఈపీసీ కాంట్రాక్టర్లు అమాంతం పెంచేశారు. ఒక్కో మెగావాట్‌కు రూ.కోటి నుంచి కోటిన్నర పెంచడంతో రైతులు జడుసుకుంటున్నారు. ప్లాంటు ఏర్పాటు చేసేదెట్లా? అని మథనపడుతున్నారు. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా రైతుల పొలాల్లో రెండు మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నది. 1,450 మెగావాట్లలో ఇప్పటి వరకు 1,100 మెగావాట్లకు పీపీఏలు కుదిరాయి. ఇక ప్లాంట్ల ఏర్పాటే తరువాయి అనుకున్న తరుణంలో రైతులకు ధరల రూపంలో కొత్త చిక్కు వచ్చిపడింది. దీంతో పీఎం కుసుమ్ పథకం ముందుకు సాగడం అనుమానంగానే కనిపిస్తున్నది. అధికారులు చొరవ తీసుకుని, ఈపీసీ కాంట్రాక్టర్లను నియంత్రించి, ధరలను అదుపుచేయాలని రైతులు కోరుతున్నారు.
రెండు మెగావాట్ల ప్లాంటు ఏర్పాటుకు ఈపీసీ (ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్, అండ్ కన్స్ట్రక్షన్) కంపెనీలు మొదట రూ.7 కోట్ల నుంచి రూ.7.2 కోట్లు అని చెప్పాయి. తర్వాత ధరలు తగ్గాయని కొన్ని కంపెనీలు రూ. 6 కోట్లే అన్నాయి. మరికొన్ని కంపెనీలు రూ.6.5 కోట్లు చెప్పాయి. రైతులు కూడా లాభాలు వస్తాయనుకొని సంతోషించారు. ఈ తరుణంలో మళ్లీ ధరలు పెరిగాయి. అది మారింది.. ఇది మారింది.. కొత్తగా దీన్ని చేర్చారు. పైగా అనఫీషియల్‌గా వాళ్లకు కొంత.. వీళ్లకు కొంత ఇవ్వాల్సి ఉంటుందని తాజాగా రెండు మెగావాట్ల ప్లాంట్ ధరను రూ.8 కోట్లకు పెంచేశారు. మొదట రూ.6 కోట్లు అని చెప్పి ఇప్పుడు ఏకంగా 8 కోట్లు అని చెప్తుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈపీసీ కాంట్రాక్టర్లు రూ.50-60 లక్షల గిట్టుబాటు చూసుకుంటున్నారని..లాభాల కోసం తమను మోసం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. మంచి ప్రాజెక్ట్ అని, లాభాలొస్తాయని తాము ఆసక్తి చూపితే, ఇప్పుడు ప్రాజెక్ట్ ధర పెరగడంతో తాము నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఈపీసీ కంపెనీలు ముందు ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరించాయి. ఆ తర్వాత 1,100 మోగావాట్ల ప్లాంట్లు కావడంలో అన్ని కంపెనీలు సిండికేట్ అయ్యాయి. ధరలను అమాంతం పెంచేశాయి. అన్ని కంపెనీలు రెండు మెగావాట్ల ప్లాంట్‌కు రూ.8 కోట్లవుతాయని చెప్తున్నాయి. అసలే అనేక అనుమానాలు, అవాంతరాలు, సమస్యలను దాటుకుని రైతులు ప్లాంట్ల ఏర్పాటు వరకు వచ్చారు. ఇప్పుడేమో ధరలను పెంచడంతో ఉసూరుమంటున్నారు. రోజుకో సమస్య తలెత్తుతుండటంతో కొందరు రైతులు అగ్రిమెంట్లను రద్దుచేసుకునే యోచనలో ఉన్నారు.
ప్లాంట్ల ఏర్పాటుకు రుణాలిచ్చేందుకు బ్యాంక్‌లు ముందుకు రావడంలేదు. ఒక్క ఎస్బీఐ మినహా ఏ బ్యాంకు కూడా తమకు మద్దతు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. అటు ధరలు పెరగడం, ఇటు బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దరఖాస్తు ఫీజులు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ కింద ఒక్కో రైతు 2 లక్షలకు పైగా చెల్లించారు. ఈ ప్లాంట్ల నుంచి వైదొలిగితే ఇప్పుడా రెండు లక్షలను కూడా కోల్పోయే ప్రమాదం ఉండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.