TDR | విచ్చలవిడి టీడీఆర్‌తో పర్యావరణ విధ్వంసం!..సీఎం రేవంత్‌రెడ్డికి పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి లేఖ
రాష్ట్ర ప్రభుత్వం టీడీఆర్ నిబంధనల్లో తీసుకొచ్చిన మార్పులతో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నదని పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
- ఎలాంటి అధ్యయనం జరుపకుండానే నిబంధనల్లో మార్పులు
- డ్రైనేజీ, రోడ్లు, ట్రాఫిక్‌పై ప్రభావాన్ని కూడా లెక్కించరా?
- దక్కన్ పీఠభూమిలో ఉన్న హైదరాబాద్‌కు భౌగోళికంగా తిప్పలు
- సీఎం రేవంత్‌రెడ్డికి పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి లేఖ
జీవో 16తో సరస్సులు, చెరువులు, కుంటలు, నదుల పరీవాహక ప్రాంతాల్లోని ఎఫ్టీఎల్, నది గరిష్ఠ వరద మట్టం, బఫర్ జోన్ భూములకు కూడా టీడీఆర్ కల్పించడం వల్ల జల వనరులకు తీవ్రనష్టం జరుగుతున్నది. ప్రభుత్వం ఉన్న జీవోను సవరించి, టీడీఆర్ పేరిట నగరంలో మరింత సులభంగా విధ్వంసం చేసే ప్రణాళికలు చేస్తున్నది. టీడీఆర్ లోడింగ్‌ను 3-5 శాతానికి తగ్గించడం వెనుక రియల్ కుట్రలు దాగి ఉన్నయ్.
-సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం టీడీఆర్ నిబంధనల్లో తీసుకొచ్చిన మార్పులతో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నదని పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. టీడీఆర్ నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 95పై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఈ జీవోల మాటున ముఖ్యనేత అనుచరులు రూ.వందల కోట్ల దందాకు తెరలేపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు హైదరాబాద్ కాంక్రీట్ జంగల్‌గా మారుతుందని, పర్యావరణ, భౌగోళిక అంశాలను బలిపీఠమెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో జీవో 95తో నగరంలో జరుగబోయే విధ్వంసంపై పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. బిల్డర్ల ప్రయోజనాల కోసం దక్కన్ పీఠభూమిలో ఉన్న పురాతన శిలా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీఆర్‌లతో నగరంలో మౌలిక వసతులు మెరుగుపడబోవని పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అంచనా లేకుండానే టీడీఆర్ ఉంటే చాలు, ఎన్ని అంతస్తులైనా కట్టుకొనే సదుపాయాన్ని కల్పించడంపై అసహ నం వ్యక్తంచేశారు. భూగర్భ జలాలు, భౌగోళిక పరిస్థితులకు ముప్పు పొంచి ఉన్నదని, మురుగునీటిముంపు, ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. భవనాల ఎత్తు పెరిగిన ప్రతిసారీ భూగర్భజలాల వినియోగం పెరుగుతుందన్నారు. వర్షపు నీటిని నిల్వచేసే సామర్థ్యం లేకుండా పోతుందని, దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఒకేచోట వందలాది కుటుంబాలు నివాసం ఉంటే మురుగునీటి ముప్పు పొంచి ఉంటుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పరిమితికి మించి వేలాది లీటర్ల మురుగు నీరు నగరంలోని నాలాలు, మూసీ నదిలోకి చేరుతుందని తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీల్లో ఎస్టీపీల వినియోగం పెరుగలేదని, వీటి నిర్వహణపై పర్యవేక్షణ లేదని విమర్శించారు. టీడీఆర్ బాండ్లపై భారీ వ్యాపారానికి తెరలేపినంత సులభంగా ఎందుకు నగరంలో మౌలిక వసతులను మెరుగుపరచడంలేదని, భౌగోళిక, పర్యావరణ అంశాలపై ప్రభుత్వం అధ్యయనం చేయలేదని ప్రశ్నించారు.
నగర మనుగడకే ప్రమాదం
జీవో 16తో సరస్సులు, చెరువులు, కుంటలు, నదుల పరీవాహక ప్రాంతాల్లోని ఎఫ్టీఎల్, నది గరిష్ఠ వరద మట్టం, బఫర్ జోన్ భూములకు టీడీఆర్ కల్పించడం వల్ల జలవనరులకు నష్టం జరుగుతున్నదని నర్సింహారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. జీవోను సవరించి, టీడీఆర్ పేరిట నగరంలో విధ్వంసం చేసే ప్రణాళికలు చేస్తున్నదని మండిపడ్డారు. టీడీఆర్ లోడింగ్ 3-5 శాతానికి తగ్గించడం వెనుక రియల్ కుట్రలు దాగి ఉన్నాయని పేర్కొన్నారు. టీడీఆర్ వినియోగాన్ని హెచ్ఎండీఏ పరిధిలో విస్తరించడం, సెట్‌బ్యాక్ మినహాయింపులు, టీడీఆర్ ఉంటే ఎన్ని అంతస్తులు అయినా కట్టుకొనే వెసులుబాటు కల్పించడం నగర మనుగడను ప్రమాదంలో పడేస్తాయని హెచ్చరించారు.
నిబంధన మార్పుపై అధ్యయనాలేవి?
నగరాభివృద్ధి, పర్యావరణ పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపే అంశాలపై నిర్ణయం తీసుకునేముందు ప్రభుత్వం సమగ్రమైన అధ్యయనం చేయాల్సి ఉంటుందని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత నిబంధనల్లో మార్పుతో కలిగే ప్రభావాన్ని అంచనా వేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. టీడీఆర్ నిబంధనల సవరణకు సంబంధించి ప్రభావ అంచనా వేయలేదని, శాస్త్రీయ అధ్యయనాలు జరుగలేదని తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభా భారాన్ని అంచనా వేయకుండానే నిబంధనలు సవరించడాన్ని ఆక్షేపించారు. 11 జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో ఇప్పటివరకు క్యారీయింగ్ కెపాసిటీపై ఎందుకు అధ్యయనం చేయలేదని ప్రశ్నించారు. జనసాంద్రత పెరిగితే పర్యావరణంపై ప్రభావం చూపుతుందని, తాగునీటి కొరత ఏర్పడుతుందని, ఉష్ణోగ్రతలు, మురుగునీటి సమస్య పెరుగుతుందని, గాలి నాణ్యత తగ్గుతుందని తెలిపారు. ఈ విషయంలో సామాజిక, ఆర్థిక ప్రభావం అంచనా వేయలేదని మండిపడ్డారు.
అసాధ్యమైన నిబంధనలు తాజా టీడీఆర్ సవరణలతో వస్తాయని పేర్కొన్నారు. నగరంలో భారీ అంతస్తులు పెరిగినకొద్దీ మురుగునీటి లోడ్ 50% పెరుగుతుందని, ఎస్టీపీలకు కేటాయించిన స్థలం పెరుగదని, దీంతో శుద్ధి చేయని నీరుగా జలవనరుల్లో చేరుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. భారీ ఆకాశ హర్మ్యాలు పెరుగుతున్నకొద్దీ పార్కింగ్ అవసరం కూడా పెరుగుతుందని, దీంతో పార్కింగ్ విస్ఫోటం జరుగుతుందని, అవసరాలకు అనుగుణంగా లోతైన సెల్లార్ల తవ్వకంతో కఠినమైన గ్రానైట్ శిలా వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంపై ఏమైనా అధ్యయనం చేశారా? అని ప్రశ్నించారు. పరిమితికి మించి నగరంలోని రోడ్లపైకి వచ్చే వాహనాలతో కలిగే కాలుష్య తీవ్రతను అంచనా వేశారా? అని అడిగారు. కొత్త సవరణలతో హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని, జోనింగ్ నిబంధనలకు అవకాశమే లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న టీడీఆర్ బ్యాంక్‌పై పారదర్శకత లోపించిందని, ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయం ఉన్నదని ఆరోపించారు.
ప్రభుత్వం పునరాలోచించాలి
కొత్తగా తీసుకొచ్చిన జీవో 95 విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. సమగ్ర సమీక్ష జరిగే వరకు ఆ జీవో అమలును నిలిపివేయాలని కోరారు. హెచ్ఎండీఏ ప్రాంతంలో పెరిగే జనసాంద్రతపై ముందుగా క్యారీయింగ్ కెపాసిటీ అసెస్మెంట్ అధ్యయనం చేయాలని కోరారు. ఇప్పటివరకు విడుదల చేసిన టీడీఆర్ సర్టిఫికెట్ల వివరాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. పెరుగనున్న జనసాంద్రతకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. ఆయా అంశాలపై 30 రోజుల్లో సరైన రీతిలో స్పందించకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

