హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : రాబోయే ఆర్థిక సంవత్సరంలో 76లక్షల మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. అడ్డంకులను అధిగమించి, కొత్త గనులను చేపట్టి 76లక్షల మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాలని టార్గెట్గా పెట్టుకున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియడం, 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభంకానుండటంతో సంస్థ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నది. 2024-25లో సంస్థ 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోగా, లక్ష్యాన్ని చేరలేకపోయింది. వర్షాలు, కొత్త గనులకు అనుమతులు రాకపోవడం ఇందుకు కారణమని సింగరేణి వర్గాలు వెల్లడించాయి. 2024-25లో సంస్థ పరిధిలోని కిష్టారం ఓసీ, పీకే ఓసీ-4, జీడీకే-5 ఓసీ, ఆర్జీ ఓసీ-2, ఆర్కే-6 ఇైంక్లెన్, ఆర్కే న్యూటెక్, ఎస్సార్సీ ఓసీ-2 గనులు ఈ ఏడాది నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యాలను సాధించాయి. మిగతా గనులు లక్ష్యాన్ని సాధించడంలో వెనుకబడ్డాయి.
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కొత్తగూడెం వెంకటేశ్ ఖని(వీకే) ఓపెన్ కాస్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. ఇటీవలే ఢిల్లీలో నిర్వహించిన ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీ అనుమతులు జారీచేసింది. దీంతో ఈ ఓపెన్కాస్టుకు పూర్తిస్థాయి పర్యావరణ అనుమతులు లభించినట్టయ్యింది. త్వరలోనే ఈ ఇందులో బొగ్గు వెలికితీతను చేపట్టనున్నారు. ఇల్లందులోని రొంపేడు ఓపెన్కాస్టుకు అనుమతులు రావాల్సి ఉంది. ఇది కూడా పూర్తయితే రోజుకు 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి మార్గం సుమగం కానున్నది.