e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home News నెలాఖరులోగా 100% వ్యాక్సినేషన్‌!

నెలాఖరులోగా 100% వ్యాక్సినేషన్‌!

  • గ్రామస్థాయిలో ప్రణాళిక
  • అవసరమైతే విద్యాసంస్థల్లో ప్రత్యేక శిబిరాలు
  • జిల్లా కలెక్టర్లకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఆదేశాలు
  • కరోనా జాగ్రత్తలు పాటించాలనిప్రజలకు విజ్ఞప్తి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 1 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు నెలాఖరులోగా రాష్ట్రంలో 100% వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని క్యాబినెట్‌ సబ్‌కమిటీ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. దీనికోసం పంచాయతీ, మున్సిపల్‌, విద్య, ఆరోగ్యం సహా అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని తెలిపింది. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం నియమించిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ బుధవారం హైదరాబాద్‌లోని బీఆర్కేభవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. దీనికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షత వహించగా, సబ్‌కమిటీలోని ఐటీమంత్రి కేటీఆర్‌, విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి పాల్గొన్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, ఒమిక్రాన్‌ వేరియంట్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ నెలాఖరుకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు ఆవాసాలు, వార్డులు, సబ్‌సెంటర్లు, మున్సిపాలిటీలు, మండలాల వారీగా ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. వ్యాక్సినేషన్‌లో దేశంలోని అనేక రాష్ర్టాలకంటే తెలంగాణ ముందువరుసలో ఉన్నదని, పంచాయతీరాజ్‌, పురపాలకశాఖల సహకారంతో వేగం గా జరుగుతున్నదని వెల్లడించారు.

క్షేత్రస్థాయి వసతులపై ప్రత్యేక శ్రద్ధ: హరీశ్‌

- Advertisement -

వైద్యారోగ్యశాఖలో క్షేత్రస్థాయిలో వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఏరియా దవాఖానల ఆధునీకరణ, రేడియాలజీ, పాథాలజీ ల్యాబ్‌లు, ఆర్టీపీసీఆర్‌ సెంటర్ల ఏర్పాటుకు అనువైన వసతులు, స్థలాలు కేటాయించాలని, కొత్త మెడికల్‌ కాలేజీ భవనాల నిర్మాణం, అనుబంధ దవాఖానల్లో అదనపు పడకల ఏర్పాటును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ అంశాలపై సంబంధిత అధికారులతో వెంటనే చర్చించాలన్నారు.

ప్రజలను చైతన్యపరచాలి: కేటీఆర్‌

ఒమిక్రాన్‌ గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కరోనా నియంత్రణ చర్యలను పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనాపై సోషల్‌ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా వ్యహరించాలని కలెక్టర్లకు సూచించారు. సీఎస్‌, వైద్యారోగ్యశాఖ నుంచి వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేయాలని, వారిని చైతన్యవంతం చేయాలని చెప్పారు. రాష్ట్రస్థాయిలో, జిల్లాల్లో అందుబాటులో ఉన్న బెడ్స్‌ సమాచారం అందించాలని, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను తిరిగి ప్రారంభించాలని, 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో వ్యాక్సినేషన్‌ శిబిరాలు ఏర్పాటుచేసి 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని మంత్రి సబిత అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ శరత్‌, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, విద్యాశాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, డీపీహెచ్‌ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, పురపాలకశాఖ కమిషనర్‌ సత్యనారాయణ, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఒమర్‌ జలీల్‌, సీఎం ఓఎస్డీ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎయిడ్స్‌ రోగులకు డయాలసిస్‌ కేంద్రాలు

వెంగళరావునగర్‌, డిసెంబర్‌ 1: హైదరాబాద్‌, వరంగల్‌లో ఎయిడ్స్‌ రోగుల కోసం ప్రత్యేక డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా ఎర్రగడ్డలోని ఛాతీ దవాఖానాలో ఎయిడ్స్‌ అవగాహన ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో 167 ఐసీటీసీ కేంద్రాలను నెలకొల్పామని, 22 ప్రభుత్వ ఏఆర్టీ చికిత్సాకేంద్రాల్లో ఎయిడ్స్‌ రోగులకు వైద్యం జరుగుతున్నదన్నారు. ఎయిడ్స్‌ రోగుల చికిత్సకు ప్రభుత్వం రూ.50కోట్లు ఖర్చుచేస్తున్నదన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఎయిడ్స్‌ 0.7 శాతంగా ఉండేదని, ఇప్పు డు 0.4 శాతానికి తగ్గిందని చెప్పారు. ఛాతీ దవాఖాన పరిసరాల్లో వెయ్యి పడకల సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన, హైదరాబాద్‌ నలువైపులా నిర్మించే నాలుగు దవాఖానలకు సీఎం కేసీఆర్‌ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement