హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని సర్కారు విద్యాసంస్థలకు ఈ నెల నుంచి ఉచిత విద్యుత్తును సరఫరా చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని 27,862 విద్యాసంస్థలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. గురువారం రవీంద్రభారతిలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన మాట్లాడారు. విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు సరఫరా కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 20 కాపీని ఆయన అధికారులకు అందజేశారు. ఇదే కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకావాల్సి ఉండగా, రాష్ట్రంలో వరద పరిస్థితి నేపథ్యంలో హాజరుకాలేకపోయారని భట్టి తెలిపారు. ఇప్పటికే 11 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేశామని, మరో 6 వేలకు పైగా పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిపారు. స్కూళ్లల్లో శానిటైజేషన్ కోసం రూ.136 కోట్ల నిధులను విడుదల చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్రంలో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ గురుకులాలను ప్రారంభించనున్నామని తెలిపారు. అనంతరం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక అవార్డులకు ఎంపికైన 150 మందిని ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఎమ్మెల్సీలు కోదండరాం, ఏవీఎన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి, ఇంటర్విద్యా డైరెక్టర్ శృతి ఓజా,ఉపాధ్యాయ సంఘాల నేతలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, లక్ష్మణ్, సదానంద్‌గౌడ్, పర్వత్‌రెడ్డి, జంగయ్య, చావ రవి, కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి, హనుమంతరావు, నవాత్ సురేష్, అబ్దుల్లా, సీ జగదీశ్, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. గురువారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు.