హైదరాబాద్: చార్మినార్ సమీపంలోని గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం (Gulzar house Incident) జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈమేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ నెల 18న గుల్జారీ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీడీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్లతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు.
అగ్ని ప్రమాదంపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టి ఘటనకు గల కారణాలు, ఘటన అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై నివేదిక ఇస్తుందన్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటారన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన ప్రతిపాదనలతో సూచనలు ఇస్తుందని తెలిపారు.