హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఇక దేశంలోనే సగటున అత్యధిక వేతనం అందుకోబోతున్నాడు. ఉద్యోగుల వేతన సవరణకు రాష్ట్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. పెరిగిన వేతనం జూలై నెలలో చేతికి అందనున్నది. మంత్రిమండలి నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 9,21,037మంది ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పెన్షనర్లు, ఇతర చిన్న ఉద్యోగులకు 30% పీఆర్సీతో ప్రయోజనం చేకూరుతుంది. గత ఏడు దశాబ్దాల్లో ఏ పీఆర్సీ కూడా పట్టించుకోని దాదాపు ఆరు లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులందరికీ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం దేశంలో ఇదే మొదటిసారి. ఉద్యోగులందరికీ పూర్తి, సమగ్ర పీఆర్సీని ప్రకటించడమూ ఇదే తొలిసారి. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రిమండలి సమావేశం ఉద్యోగుల పీఆర్సీకి ఆమోదం తెలిపింది. పెంచిన వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు రూ.12,595 కోట్ల వరకు లబ్ధి చేకూరనున్నది. ఉద్యోగులకు నోషనల్ బెనిఫిట్‌ను 2018 జూలై 1 నుంచి, మానిటరీ బెనిఫిట్‌ను 2020 ఏప్రిల్ 1 నుంచి, క్యాష్ బెనిఫిట్‌ను 2021 ఏప్రిల్ 1 నుంచి అమలుచేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీచేయాలని అధికారులను మంత్రిమండలి ఆదేశించింది. పెన్షనర్లకు 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2021 మే 31 వరకు చెల్లించాల్సిన ఎరియర్స్ (బకాయిలను) 36 వాయిదాల్లో చెల్లించాలని క్యాబినెట్ నిర్ణయించింది. కేజీబీవీ, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరుచేయాలని నిర్ణయించింది. హెచ్ఆర్ఏ మీద పరిమితిని తొలిగించాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది.
తాజా పీఆర్సీతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు దేశంలోనే సగటున అత్యధిక వేతనాలు అందుకోబోతున్నారు. ఇవాళ రాష్ట్రంలో సబార్డినేట్ ఉద్యోగి బేసిక్ వేతనం ఇప్పటివరకు నెలకు సుమారు రూ.19 వేలు ఉండగా వచ్చే నెలనుంచి దాదాపు రూ.22,240 వరకు అందుకోబోతున్నాడు. ఇదే క్యాడర్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నెలకు రూ.18 వేలు, గుజరాత్లో రూ.14 వేలు, పొరుగురాష్ట్రమైన ఏపీలో రూ.13 వేల వరకు అందుకొంటున్నారు. అధికారుల వేతనాలు కూడా అదేస్థాయిలో ఇతర రాష్ర్టాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక తెలంగాణలోనే అధికంగా పీఆర్సీ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థికంగా మంచిగున్న రోజుల్లో కూడా 39 శాతం మించి ఏనాడూ పీఆర్సీ ఇవ్వలేదు. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి వంటివారి కాలంలో ఇచ్చిన పీఆర్సీలు ఎందుకు కొరగాకుండా ఉండేవి. మర్రి చెన్నారెడ్డి ఉద్యోగులకు మూడేండ్లకు ఒక ఇంక్రిమెంట్ చొప్పున ఇచ్చారు. జలగం వెంగళరావు 5%, వైఎస్ 16%, చంద్రబాబు 25% ఫిట్మెంట్ ఇచ్చి సరిపుచ్చుకున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ 2015లో 43%, తాజాగా 30% ఫిట్మెంట్ ఇచ్చి భారీగా వేతనాలు పెంచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం నాలుగైదువేల రూపాయలు మాత్రమే ఉండేవి. తాజాగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ ఇచ్చి వేతనాలు పెంచిన ఘనత నిశ్చయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌దే.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం కింద పనిచేస్తున్న ఉద్యోగి రిటైర్ కావడానికి ముందు చనిపోతే.. పాత పద్ధతిలో పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకొన్నారు. సీపీసీ ఉద్యోగి రిటైర్మెంట్కు ముందే చనిపోతే.. అతని భాగస్వామ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి.. ఆ ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తీసుకొన్న ఈ నిర్ణయానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్రవేసింది. అదేవిధంగా ఉద్యోగుల గ్రాట్యుటీ పరిమితిని రూ.12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది.