హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందనేది సామెత. ఇప్పుడు రాష్ట్ర నీటిపారుదలశాఖలో ఓ ఉన్నతాధికారి తీరు కూడా అదే విధంగా తయారైంది. సాంకేతిక అంశాలపై సహాయకారిగా ఉంటారని, ఏరికోరి తెచ్చిపెట్టుకుంటే.. ఇప్పుడు ఏకంగా అమాత్యుడికేకాదు, శాఖకే తీరని తలనొప్పిగా మారారని ఇంజినీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్దిరోజులకే ఇరిగేషన్‌శాఖలో అత్యంత కీలకస్థానం ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి, శాఖ అత్యున్నత అధికారికి సాంకేతికంగా, సహాయకారిగా ఉండేందుకు సర్కారు మరో యువ అధికారిని నియమించింది. ఇరిగేషన్‌శాఖకు సంబంధించి ప్రతీ ఫైల్‌ను ఆయన ద్వారానే శాఖ ఉన్నతాధికారికి చేరేలా అధికారాలు కల్పించింది. సదరు చిన్నసారు ఇదే అదునుగా తన చేతివాటాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టారని జలసౌధ, సచివాలయ వర్గాలు చెప్తున్నాయి.
చిన్నసారు వచ్చినప్పటి నుంచి శాఖాపరంగా సాధించిన ప్రగతి ఏమీ లేదని, వ్యక్తిగతంగా మాత్రం బాగానే వెనుకేసుకుంటున్నారని బాహాటంగానే చర్చ నడుస్తున్నది. ఇరిగేషన్‌శాఖలో ప్రతీ విభాగం ఓఅండ్ఎం, క్వాలిటీ కంట్రోల్, సీడీవో (సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్), అడ్మినిస్ట్రేషన్, జనరల్ ఇలా ప్రతీ దాంట్లో సదరు చిన్నసారు తనదైన శైలిలో వసూళ్లకు తెరలేపారని తెలుస్తున్నది. చీఫ్ ఇంజినీర్ల నుంచి మొదలుకొని, ఎస్ఈలు, ఈఈలను కూడా చిన్నసారు వదిలిపెట్టడం లేదని ఇంజినీర్లు వాపోతున్నారు. ఫలానా హోటల్ బిల్లు కట్టి రావాలని, లేదంటే కార్ సర్వీసింగ్ చార్జీలు చెల్లించాలని, ఫర్నిచర్ కొనివ్వాలని, ఖరీదైన మొబైల్ కొనివ్వాలంటూ ఇంజినీర్లను సదరు చిన్నసారు వేధిస్తున్నారని ఓ అధికారి వాపోయారు.
ముడుపులు నాతోని కాదు సార్!
ఇటీవల సదరు చిన్నసారు.. ఓ ఎస్ఈకి ఫోన్ చేశారట. ఏదో బిల్లు కట్టమని హుకుం ఇచ్చారని తెలిసింది. అయితే తనవద్ద పనులేమీ కొనసాగడడం లేదని, పైసా కూడా విదల్చలేనని సదరు ఎస్ఈ ముఖం మీదనే తేల్చిచెప్పారంటే చిన్నసారు పరిస్థితి ఎలా మా రిందో అర్థం చేసుకోవచ్చు. ఇరిగేషన్‌శాఖలో ఎంతోమంది వద్ద పనిచేశామని, ఇలాంటి దుస్థితి చూడలేదని ఇంజినీర్లు వాపోతున్నారు.
మంత్రికే తలనొప్పిగా
చిన్నసారు ఇంజినీర్లకే కాదు ఏకంగా మంత్రికే తలనొప్పిగా మారారని జలసౌధవర్గాలు కోడై కూస్తున్నాయి. తన అడ్డగోలు చేతివాటంతో మంత్రికి ఇబ్బందులు తీసుకొస్తున్నారని అధికారులు చర్చించుకుంటున్నారు. ఇరిగేషన్‌శాఖలో ఇటీవల కల్పించిన పదోన్నతుల్లోనూ పలు అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల 1 ఈఎన్సీగా, 11 మందికి సీఈలుగా, 46 మందికి ఎస్ఈలుగా, 85 మందికి ఈఈలుగా, 123 మందికి డీఈఈలుగా ప్రమోషన్ కల్పించింది. అయితే ఈ ప్రక్రియలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటించకుండా ఇష్టారీతిన ప్రమోషన్లను కల్పించారని, అంతేకాదు అనుయాయుల కోసం కొందరు అధికారులను ప్రమోషన్ల జాబితా నుంచి తప్పించారని, అందుకు అనుగుణంగా సీనియారిటీ జాబితాలను రూపొందించారని, జాబితాలో చివరలో ఉన్న వారిని ముందుకు తీసుకొచ్చారని ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు.
అవే ఆరోపణలతో పలువురు ఇంజినీర్లు కోర్టును ఆశ్రయించారు. ప్రమోషన్లు సాధించిన ఇంజినీర్లకు ఏర్పాటు చేసిన అభినందన సభను కూడా మంత్రి రద్దు చేసుకున్నారు. అయితే ఈ ప్రమోషన్లలో అవతవకలకు సంబంధించి సదరు చిన్నసారే ప్ర ధాన పాత్ర పోషించారని ఇంజినీర్లు ఘంటాపథంగా చెప్తున్నారు. చిన్నసారు వల్లే అమాత్యుడికే తలవంపులు ఎదురయ్యాయని సెక్రటేరియట్ వర్గాలు వివరిస్తున్నాయి. అంతే కాదు ఇటీవల జరిగిన బదిలీల్లోనూ చిన్నసారు అక్రమాలకు పాల్పడ్డారని ఇంజినీర్లు బాహాటంగానే వివరిస్తున్నారు. చేయితడిపిన వారికి కోరుకున్న చోట పోస్టింగ్ ఇచ్చారని, అందుకోసం సీనియర్లను కూడా పక్కనపెట్టారని ఇంజినీర్లే తెలుపుతున్నారు.
పెద్దసారు మందలించినా మారని తీరు
చిన్నసారు వ్యవహారం ఇరిగేషన్‌శాఖలో కొంతకాలంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన ప్రమోషన్లు, బదిలీల ఉదంతంతో అవి పెద్దసారు దృష్టికి సైతం వెళ్లాయి. ఇదే విషయమై చిన్నసారును పిలిచి పెద్దసారు మందలించినట్టు విశ్వసనీయ సమాచారం. తానేమీ తప్పు చేయలేదని చిన్నసారు బుకాయించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు ఇకపై అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోనని చెప్పినట్టు తెలిసింది. ఆ మేరకు అడ్మినిస్టేషన్ ఫైల్స్‌ను ప్రస్తుతం నేరుగా పంపిస్తున్నారని తెలిసిందే. అయితే ఇతర వ్యవహారాల్లో చిన్నసారు తీరు మాత్రం ఏమీ మారలేదని ఇంజినీర్లు వివరిస్తున్నారు. మళ్లీ మళ్లీ ఐదుకు, పదికి సైతం ఫోన్ చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.