తొర్రూరు, ఆగస్టు 24: డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో చోటుచేసుకుంది. తొర్రూరు పట్టణం బీరప్పనగర్‌కు చెందిన రమేశ్, లక్ష్మీకాంత కుమారుడు బేతమల్ల ప్రేమ్‌కుమార్ (23) వరంగల్ జిల్లా బొల్లికుంట వాగ్దేవి కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఇటీవల హైదరాబాద్‌కు వెళ్లి జ్వరం బారినపడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి పిలిపించారు.
తొర్రూరులోని ఓ ప్రైవేట్ దవాఖానలో శుక్రవారం చికిత్స చేయించి అదే రోజు ఇంటికి తీసుకొచ్చారు. శనివారం ఉదయం జ్వరం తీవ్రం కావడం, వాంతులు, ఫిట్స్ రావడంతో పట్టణంలోని మరో ప్రైవేట్ దవాఖానకు తరలించారు. రక్తకణాలు పూర్తిగా తగ్గాయని, పెద్ద దవాఖానకు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడంతో ఖమ్మంలోని మరో ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేతికొచ్చిన కొడుకు డెంగ్యూతో చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.