హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో ఆదివారం నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు పెద్ద సంఖ్యలో మహిళా నేతలు తరలివచ్చారు. రంగురంగుల పూలు, కోటొక్క పాటలతో కోలాహలం నెలకొన్నది. ‘బతుకమ్మ.. బతుకమ్మ మా తల్లీ బతుకమ్మా.. చిత్తూ చిత్తూల బొమ్మా.. శివుని ముద్దుల గుమ్మా.. బంగారు బొమ్మ దొరికెనమ్మా ఈ వాడలోనా.. బంతి పూదోటలన్నీ బంగారు వర్ణమై బతుకమ్మ రూపంలో మెరిసెనే..’ లాంటి బతుకమ్మ పాటలతో తెలంగాణభవన్ ప్రాంగణం ప్రతిధ్వనించింది. మధ్యాహ్నం మహిళా నేతలందరూ కలిసి సంప్రదాయబద్ధంగా పాటలు పాడుతూ తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. అనంతరం తెలంగాణభవన్ ప్రాంగణంలో ఉంచి ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో’ అంటూ పాడుతూ లయబద్ధంగా బతుకమ్మ ఆడారు. చిన్నారులు సైతం వారితో పాదం కలిపారు. అనంతరం సమీపంలోని నీటి కొలనులో నిమజ్జనం చేశారు. అనంతరం ఫలహారం ఇచ్చిపుచ్చుకొని ఇండ్లకు తిరుగు పయనమయ్యారు.
వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రూపొందించిన పాటలు పాడుతూ హుషారుగా బతుకమ్మ ఆడారు. ‘గులాబీల జెండలే రామక్క.. గురుతుల గురుతుంచుకో రామక్క.. మన అన్న కేసీఆర్ రామక్క.. ఏమి పనులు జేసేనే రామక్క.. సారే రావాలన్నరు.. మళ్లీ కారే కావాలన్నరు.. దేఖ్లేంగే’ లాంటి పాటలతో హోరెత్తించారు. కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలపై ‘మార్పు..మార్పని.. వలలో.. మనలని ముంచిండ్రే వలలో.. ఆరు గ్యారెంటీలు ఉయ్యాలో.. ఆగమే జేసిన్రు ఉయ్యాలో.. అభయాస్తం ఉయ్యాలో.. శూన్య హస్తమాయే ఉయ్యాలో.. మార్పు.. మార్పు అని ఈ చెయ్యి గుర్తుకు ఓటేస్తే ఆగమాగం చేస్తున్రు ఈ కాంగ్రెస్సోళ్లు..’ అంటూ పాటలు పాడి బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ విప్ గొంగిడి సునీత, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, టీజీపీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రాఆనంద్, మహిళా నేతలు సుశీలారెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పద్మ, సింధు, పార్టీ లీగల్‌సెల్ మెంబర్ లలితారెడ్డి, రుద్ర రాధ, హరిరమాదేవి, సత్యవతి, నిరోషా, అరుణ, నిర్మల, రజిత, చారులత తదితరులు పాల్గొన్నారు.