మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించింది. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా అంతటా పోలీస్ యాక్ట్ 30ని (Police Act) అమలు చేస్తున్నారు. సోమవారం (డిసెంబర్ 2) నుంచి జనవరి 1 వరకు జిల్లా అంత ఆమలులో ఉండనున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ డీ. జానకి వెల్లడించారు. ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ఎలాంటి బహిరంగ సమావేశాలు కానీ, ఊరేగింపులు, ధర్నాలు జరుపకూడదని తెలిపారు. నిషేధిత ఆయుధాలైన కత్తులు, చాకులు, కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, నేరాలకు పురిగొల్పే ఎలాంటి ఆయుధాలను వాడకూడదని చెప్పారు. భారీగా జనసమూహాన్ని పోగుచేసే సమావేశాలు, లౌడ్ స్పీకర్లు, డీజేలపై కూడా నిషేధం ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని తెలిపారు.
నిర్బంధం దిశగా..
స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు తెలంగాణను నిర్బంధంలోకి నెడుతున్నది. అధికారంలోకి రాగానే ప్రజాభవన్ వద్ద కంచెలు కూల్చి, ఇకపై ఆంక్షలు ఉండవంటూ హడావుడి చేసిన ప్రభుత్వం.. తాజాగా తన అసలు రంగును బయటపెట్టింది. తమ అసమర్థ పాలనను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పోలీసులను నమ్ముకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యాక్ట్‌ను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల సంతోషాలను మింగేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రశ్నించే హక్కును కాలరాసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే హైదరాబాద్‌లో 144 సెక్షన్ అమలు చేయగా, జిల్లాల్లోనూ పోలీస్ యాక్ట్‌ను విధిస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో నవంబర్ మొత్తం పోలీస్ యాక్ట్ అమలు చేశారు. కామారెడ్డి జిల్లాలో గత నెల 7 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నది. కాంగ్రెస్ ప్రభు త్వం ఇప్పటివరకు అధికారికంగా 13 జిల్లాల్లో పోలీస్ యాక్ట్‌ను అమలు చేయగా, అనధికారికంగా 20కి పైగా జిల్లాల్లో పోలీస్ యాక్ట్ నిబంధనలను అమలు చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి.