కమాన్‌పూర్/పాలకుర్తి, డిసెంబర్ 7: మావోయిస్టులపై జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌర హక్కులసంఘం నేత కుమారస్వామి డిమాండ్ చేశారు. ఇటీవల ఎన్కౌంటర్లో అసువులు బాసిన మావోయిస్టు, పాలకుర్తి మండలం రాణాపూర్‌కు చెందిన ఏగోలపు మల్లయ్య అలియాస్ మధు అంత్యక్రియలు శనివారం స్వగ్రామంలో జరుగగా ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. రేవంత్ సర్కారు గద్దెనెక్కినంక ఏడాది కాలంలో జరిగిన నాలుగు ఘటనలపై హైకోర్టు జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి: రాజకీయ ఖైదీల విముక్తి కమిటీ నేత రవీందర్
సమాజంలో సమానత్వం కోసం ఉద్యమిస్తున్న మావోయిస్టు నేతల బూటకపు ఎన్కౌంటర్లపై ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని రాజకీయ ఖైదీల విముక్తి కమిటీ నేత రవీందర్ పేర్కొన్నారు. జగిత్యాల జైత్ర యాత్ర నేపథ్యంలో మావోయిస్టు ఉద్యమంలోకి అడుగుపెట్టిన మల్లయ్య నమ్మిన సిద్ధాంతం కోసం 32 ఏళ్ల పాటు పోరుబాట సాగించారని గుర్తు చేశారు.
మల్లయ్యది బూటకపు ఎన్‌కౌంటరే: భార్య మీనా
తన భర్తది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని మల్లయ్య భార్య మీనా ఆరోపించారు. 32 ఏళ్ల పాటు అడవి బాట పట్టి ఉద్యమం చేస్తున్న తన భర్త ఎన్కౌంటర్లో చనిపోయాడంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. చిత్ర హింసలు చేసి, ములుగు జిల్లా ఏటూరునాగారం అడవుల్లోకి తీసుకెళ్లి కాల్చి చంపి, ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.