కొత్తగూడెం ప్రగతి మైదాన్, జనవరి 3 : భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. శనివారం ఛత్తీస్గఢ్ సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో ఇవి జరిగాయి. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్, బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం& సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో డీఆర్జీ బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
తర్వాత 12 మంది మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఒక ఏకే-47, ఒక రైఫిల్, ఇతర ఆయుధ, వస్తు సామగ్రి లభ్యమయ్యాయి. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో మోస్ట్ వాంటెడ్ డివిజన్ కమిటీ సభ్యుడు మంగ్తుతో పాటు హుంగా మడ్కం ఉన్నారు.