మహదేవపూర్/కాళేశ్వరం, మే 27 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌ను ఈఎన్సీ అనిల్ కుమార్ బృందం సోమవారం సందర్శించింది. బరాజ్ ఏడో బ్లాక్‌లో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు బరాజ్‌లో చేపడుతున్న పనుల్లో భద్రతా చర్యలు పాటిస్తూ వేగం పెంచాలని ఈఎన్సీ ఆదేశించారు. బరాజ్‌లోని ఏడో బ్లాక్‌లో కుంగిన 19, 20, 21 పియర్ల వద్ద జరుగుతున్న పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. షీట్ ఫైల్స్, మట్టి రహదారి నిర్మాణ పనులు, ఆర్క్ గ్రౌటింగ్ పరికరంలో జరుగుతున్న 20,21వ గేట్ కట్టింగ్‌ను, సీసీ బ్లాక్‌ల అమరిక, కుంగిన పియర్ల పునాదుల కింద ఏర్పడ్డ ఖాళీ ప్రదేశాలను సిమెంట్, ఇసుకతో నింపేందుకు జరుగుతున్న బోర్‌హోల్ పనులు, కుంగిన పియర్ల వద్ద ఏర్పడ్డ బొరియల పూడ్చి వేత పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎల్టీ ప్రతినిధులతో చర్చించి పలు సూచనలు చేశారు. వర్షాకాలంలోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఇసుకను రాళ్లను తొలగించాలని ఆదేశించారు. ఆయన వెంట భారీ నీటిపారుదల శాఖ ఈఈ తిరుపతిరావు, డీఈ సూర్యప్రకాశ్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
అన్నారం బరాజ్ సందర్శన
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్‌ను ఈఎన్సీ అనిల్ సందర్శించారు. బరాజ్ పైన తీస్తున్న ఇసుకను పరిశీలించారు. అనంతరం బరాజ్ కింది వైపునకు వెళ్లి అక్కడ జరుగుతున్న పనుల గురించి తెలుసుకొన్నారు. లీకేజీ తదితర పనులను వర్షాకాలం రాక ముందే పూర్తి చేయాలని సూచించారు. మేడిగడ్డ నుంచి కన్నేపల్లి పంప్‌హౌస్ వరకు నీటిని ఆపగలమా? అని అధికారులతో చర్చించారు. అనంతరం గ్రావిటీ కెనాల్ నుంచి కన్నేపల్లి (లక్ష్మీ) పంప్‌హౌస్‌ను సందర్శించారు. వీరి వెంట సీఈ సుధాకర్‌రెడ్డి, సీఈ సీడీవో మోహన్‌రావు, ఈఈ తిరుపతిరావు, ఐఐటీ ప్రొఫెసర్ శశిధర్రావు, రిటైర్డ్ సీఈ సీడీవో తదితరలు ఉన్నారు.