హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్ మినట్స్ డ్రాఫ్ట్‌లో వెల్లడించిన అంశాలు అవాస్తవాలని తెలంగాణ మండిపడింది. బోర్డు తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈఎన్సీ అనిల్‌కుమార్ తాజాగా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. జీఆర్ఎంబీ సమావేశాన్ని గత నెలలో నిర్వహించారు. ఆ భేటీలో నమోదు చేసిన అంశాలను వివరిస్తూ తాజాగా బోర్డు రెండు రాష్ర్టాలకు మినట్స్ డ్రాఫ్ట్ నోట్‌ను పంపింది.
దానిపై అభ్యంతరాలు, సవరణలేమైనా ఉంటే తెలపాలని కోరింది. దీంతో ఆ డ్రాఫ్ట్ నోట్లోని అంశాలను తెలంగాణ ఈఎన్సీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ జీఆర్ఎంబీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బోర్డుకు సంబంధించిన వివరాలపై చైర్మన్ అనుమతి తీసుకునే ప్రెజెంటేషన్ ఇచ్చామని, కానీ అందుకు విరుద్ధంగా కావాలనే జోక్యం చేసుకుని, సొంత ఎజెండాను ప్రజెంట్ చేశారని పేరొనడం ఏమిటని మండిపడ్డారు. ప్రెజెంటేషన్‌లో తెలంగాణ వెల్లడించిన అంశాలను మినట్స్‌లో పొందుపరచలేదని ధ్వజమెత్తారు.