నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి4 (నమస్తే తెలంగాణ)/మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ప్రజాపాలన- ప్రగతిబాట పేరిట బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారసభలో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం మొదలయ్యేసరికే సభా ప్రాంగణం ఖాళీ కావడం గమనార్హం. సీఎం వేదికపైకి రాగానే వెనుకాల ఉన్న జనం లేచి నిలబడటం.. ఆ తర్వాత మెల్లగా జారుకోవడం కనిపించింది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడటం మొదలుపెట్టగానే జనం సభాప్రాంగణం నుంచి బయటకు బారులు తీరారు. సీఎం ప్రసంగం మొదలయ్యేసరికే 30శాతం వెనుక వైపున్న ఉన్న కుర్చీ లు ఖాళీ కాగా, మరో 20 శాతం మంది జారుకున్నారు. ఆ తర్వాత సీఎం ప్రసంగం 32 నిమిషాలు కొనసాగగా సభ నుంచి వాహనాల వద్దకు జనం బారులు తీరారు. ముఖ్యంగా బలవంతంగా రుణాల పేరుతో తరలించిన మహిళలు పెద్దఎత్తున ముందే వెళ్ళిపోవడం కనిపించింది.
అంతకు ముందు జిల్లా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు మాట్లాడుతుండగానే జనం వెళ్తుండటాన్ని గమనించి..వారు తమ ప్రసంగాన్ని కుదించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరికి రూ.300, క్వార్టర్ బాటిల్ చొప్పున ఇచ్చి ట్రాక్టర్లు, డీసీఎంల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని సభకు తరలించారు. సభకు వచ్చిన వారిలో పెద్దఎత్తున సమీపంలో ఉన్న మద్యం దుకాణాల వద్ద కనిపించారు. మిర్యాలగూడ పట్టణానికి, నియోజకవర్గానికి సీఎం వరాలు ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు ఎటువంటి హామీలు ఇవ్వకపోవడంతో నిరాశా నిస్పృహలకు లోనయ్యారు. ప్రజాపాలన-ప్రగతిబాట కార్యక్రమం, అభివృద్ధి పనుల శంకుస్థాపనల పేరిట ఏర్పాటు చేసిన సభ పూర్తిగా ఎన్నికల ప్రచార సభగా మారింది. పార్టీ జెండాలు, గుర్తులు కనిపించినా ఎన్నికల అధికారులకు పట్టింపే లేకుండా పోయింది. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలంటూ సీఎం రాజకీయ ప్రసంగం చేయడంపై పలువురు విమర్శించారు.
ఏ వేదికైనా సరే వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం, ప్రేలాపనలతో నోరు పారుసుకోవడమే తన నైజమన్నట్టుగా మరోసారి సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి కొనసాగింది. మిర్యాలగూడలో ప్రజాపాలన-ప్రగతిబాట సభలో కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ తన అక్కసును వెళ్లగక్కారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు గురించి కూడా వ్యక్తిగత దూషణలు చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేయగా కాంగ్రెస్ పార్టీ, చెయ్యిగుర్తు జెండాలతో నిర్వహించిన సభలో దొంగ, లుచ్చా, సన్నాసి, సిగ్గులేనోడు, నక్కజిత్తుల.. ఇలా పరుష పదజాలంతో సీఎం ప్రసంగం సాగడంతో సభకు వచ్చిన వాళ్లే ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది. సభకు వస్తేనే వడ్డీ లేని రుణాలు వస్తాయంటూ ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసి మహిళలను తీసుకొచ్చారు. వీరినే మిర్యాలగూడ పట్టణం నుంచి భారీగా తరలొచ్చిన ప్రజలంటూ సీఎం తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. వాస్తవంగా మిర్యాలగూడ మున్సిపాలిటీ నుంచి సభకొచ్చిన వారు పెద్దగా లేరనే విషయం దీంతో బట్టబయలైంది.