హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) కంచ గచ్చిబౌలి భూముల వివాదం మరో మలుపు తిరిగింది. అక్కడి వాస్తవ పరిస్థితిని తెలుసుకొనేందుకు సుప్రీంకోర్టు కేంద్ర సాధికార కమిటీని పంపాలని నిర్ణయించింది. వివాదాస్పదమైన ఆ 400 ఎకరాల భూమిలో చెట్లు మినహా జింకలు, నెమళ్లు లేనేలేవని, కృత్రిమ మేధతో సృష్టించిన వీడియో క్లిప్పింగ్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించడం, ఈ నెల 3న హైకోర్టు రిజిస్ట్రార్ ఆ భూములను పరిశీలించి నివేదిక పంపిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. సిద్ధాంత్ దాస్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ బుధవారం హైదరాబాద్ రానున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ కమిటీ 10, 11 తేదీల్లో రెండురోజుల పాటు ఉండి క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకొని, సంబంధిత అధికారుల నుంచి సమాచారం కూడా తీసుకోనున్నట్టు తెలిసింది.
కమిటీ ఏం చేయనుంది?
సుప్రీంకోర్టు సాధికార కమిటీ ఈ నెల 10న కంచ గచ్చిబౌలిలోని హెచ్సీయు భూములలో క్షేత్రస్థాయి విచారణ జరిపి, అకడి చెట్లు, పర్యావరణం, జంతుజాలం వివరాలను నమోదు చేయనున్నట్టు సమాచారం. ఆ ప్రదేశాన్ని చదును చేయటానికి ముందే పర్యావరణ మదింపు జరిగిందా? చెట్లను తొలగించేందుకు అటవీశాఖ నుంచి అనుమతి తీసుకున్నారా? ఒకవేళ చెట్లను తొలగిస్తే అక్కడ ఉన్నటువంటి పక్షులు, జంతుజాలం విషయంలో తీసుకున్న ముందస్తు చర్యలేమిటి, నీటి వనరుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా రు అనే విషయాలను పరిశీలించనుంది. రెండో రోజు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీతోపాటు అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సంబంధిత శాఖ ఉన్నతాధికాలతో కమిటీ భేటీ అవుతుందని సమాచారం. అనంతరం యూనివర్సిటీ పాలకమండలి, విద్యార్థులు, పౌర సమాజం నుంచి కూడా వినతులు స్వీకరించే అవకాశముంది. ప్రజల నివాస ప్రాంతాల్లోకి జంతువులు ప్రధానంగా జింకలు వచ్చినట్టు వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతున్న నేపథ్యంలో… ఎంపవర్డ్ కమిటీ సమీప ప్రాంతాల ప్రజల నుంచి కూడా వివరాలు సేకరించే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.
ఇదీ కమిటీ నేపథ్యం..
అటవీ, పర్యావరణ వివాదాలను పరిషరించేందుకు సుప్రీంకోర్టు 25 ఏండ్ల క్రితం సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదికను అత్యున్నత ధర్మాసనం ప్రామాణికంగా తీసుకుంటుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు పోలవరం, కొల్లేరు లాంటి ప్రాంతాల్లో ఈ తరహా వివాదాలు ఏర్పడినప్పుడు ఎంపవర్డ్ కమిటీ నివేదికలను ప్రామాణికంగా తీసుకొని తీర్పులివ్వడం జరిగింది. మహారాష్ట్రలో మెట్రో కోసం చెట్లు నరికిన కేసులోనూ ఈ కమిటీ నివేదిక కీలకం అయ్యింది.