హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : ఇచ్చిన హామీలు విస్మరించడం.. న్యాయంగా దక్కాల్సినవి దక్కకపోవడంతో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం గర్జించింది. పోరుబాట పట్టింది. పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు అన్న తేడాల్లేకుండా అంతా పిడికిలెత్తారు. రేవంత్‌రెడ్డి సర్కార్‌పై తిరుగుబాటు జెండాఎగురవేశారు. పరిపాలన కేంద్రమైన సచివాలయం నుంచి మొదలుకొని మండలాఫీసు వరకు ఉద్యమాలతో హోరెత్తించారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ‘తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ’ ఆధ్వర్యంలో శుక్రవారం ఉద్యోగులంతా మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలకు దిగారు.
టీజీఈ జేఏసీ(తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు, రిబ్బన్లు, కండువాలు, నల్లచొక్కాలు ధరించిన నేతలు ఉమ్మడి జిల్లాలవ్యాప్తంగా మండల, డివిజన్, జిల్లా కార్యాలయాలు, హైదరాబాద్‌లోని అన్ని హెచ్వోడీల్లో ఆఫీసుల ఎదుట నిరసన తెలిపారు. వేలాది మంది ఉద్యోగుల నిరసనలతో సచివాలయం ఆవరణ హోరెత్తింది. సచివాయలంతోపాటు లోక్‌భవన్, అసెంబ్లీ ఉద్యోగులు, సిబ్బంది సైతం నిరసనల్లో పాల్గొన్నారు. ఉద్యోగులంతా భారీ ర్యాలీ నిర్వహించి గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సర్కార్ తీరును నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
హైదరాబాద్ కలెక్టరేట్, అబిడ్స్‌లోని బీమా భవన్ ఎదుట నిర్వహించిన ఆందోళనల్లో జేఏసీ నేతలు పాల్గొని, గళమెత్తారు. ‘తెలంగాణ సర్కార్ నంబర్ వన్.. పీఆర్సీ ఎగ్గొట్టడంలో నంబర్ వన్, డీఏలు ఎగ్గొట్టడంలో నంబర్ వన్’ అంటూ నినదించారు. అనంతరం తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హైదరాబాద్ ఆర్డీవో రామకృష్ణకు వినతిపత్రం అందజేసింది. జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారులకు వినతిపత్రాలిచ్చినట్టు లచ్చిరెడ్డి వెల్లడించారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే మరో ఉద్యమం తప్పదని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ సర్కార్‌ను హెచ్చరించింది. 64 డిమాండ్లను పరిష్కరించకపోతే దశలవారీగా ఉద్యమిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఎంపాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే హామీలు అమలయ్యేదెప్పుడు.. ఉద్యోగుల కష్టాలు తీరేదెప్పుడు అన్నట్టుగా తయారయ్యిందని వాపోయారు. తాము కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మాత్రమే అడుగుతున్నామని తెలిపారు. పీఆర్సీ కాల పరిమితిని పెంచుకుంటూ పోవడం అత్యంత దారుణమని మండిపడ్డారు. ‘కొంత సమయం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.. రెండున్నరేండ్లు గడుస్తున్నది. ఇంకా ఎంత కాలం ఓపికపట్టాలి.. ఎన్ని రోజులు వేచిచూడాలి’ అని ప్రశ్నించారు. ప
థకాలకు బడ్జెట్ ఉంటుంది.. కానీ ఉద్యోగులకు వచ్చేసరికి మాత్రమే బడ్జెట్ ఉండదా..? అంటూ నిలదీశారు. ఇప్పటికే రెండున్నరేండ్లు పీఆర్సీ కోల్పోయాం. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ బిల్లులు విడుదల చేయడంలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు ఐఏఎస్ అధికారులు కావాలనే ఉద్యోగులను ఇబ్బందులు పెడుతున్నారని, రాజకీయ నాయకులకు ఐఏఎస్‌లు తొత్తులుగా మారొద్దని సూచించారు. జేఏసీ నేతలు ఎస్ఎం హుస్సేనీ(ముజీబ్), బీ శ్యామ్, వంగ రవీందర్‌రెడ్డి, జీ సదానందంగౌడ్, కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్, ఎంబీ కృష్ణాయాదవ్, కే లక్ష్మయ్య, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీగిరి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రేమ్, కోశాధికారి కైలాష్ తదితరులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత దేవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చి, ముప్పై నెలలు దాటినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడం దుర్మార్గమని వాపోయారు.శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. అధికారంలోకి రావడానికి ముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రెండేండ్లుగా ప్రభుత్వానికి నివేదించినా ఫలితం కనిపించడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ ఆవేదనతో ఉద్యోగులు రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకు ఆందోళనకు దిగారని పేర్కొన్నారు. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టంచేశారు. దేశంలో ఉద్యోగులకు 5 డీఏలు బకాయి పడిన ఏకైక ప్రభుత్వం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రమే అని, రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల 86 మంది చనిపోయారని, వేలాది మంది నిత్యం కోర్టుల చుట్టూ, సచివాలయం చుట్టూ తిరుగుతున్నారని వాపోయారు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు ప్రకటించారు.
ఉద్యోగులమంతా ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. మా మంచితనాన్ని.. చేతగానితనంగా సర్కార్ భావిస్తున్నట్టుంది. అందుకే మేం కొట్లాడుతున్నా స్పందించడంలేదు. హక్కుగా రావాల్సిన డబ్బులు విడుదల చేయడంలేదు. హెల్త్‌కార్డులు ఇవ్వడంలేదు. ఉద్యోగులు మళ్లీ పిడికిలి ఎత్తాల్సిన రోజులు ముందున్నాయి. ఉద్యమాలే శరణ్యం. ఉద్యోగులంతా అమరవీరులను తలచుకొని మళ్లీ పోరాడాల్సిన తరుణం ఆసన్నమైంది.. పైసల్లేవు..పైసల్లేవు అంటరు. కొత్త పథకాలు పెడుతున్నరు. మాకిచ్చేందుకే డబ్బుల్లేవా..?
– ఎస్ఎం హుస్సేనీ (ముజీబ్)
‘డీఏ అంటే డిలే అలవెన్స్’ ‘పీఆర్సీ అంటే పెండింగ్ రివిజన్ కమిషన్’గా మారిపోయింది. ఆరు నెలల్లో మూడు డీఏలు, పీఆర్సీ ప్రకటిస్తామని అన్నారు. రెండేండ్లు గడిచినా ఊసేలేదు. ఇండ్లు కట్టుకొనేందుకు.. పిల్లల పెండ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బులు ఇవ్వడంలేదు. మా జీతాల నుంచి దాచుకున్న డబ్బులు.. జీపీఎఫ్, జీఎల్ఐ, పీఎల్ఏ బిల్లులు మూడేండ్లు, నాలుగేండ్లు గడుస్తున్నా ఇవ్వడంలేదు. మే 5న రాష్ట్రవ్యాప్తంగా నిరహారదీక్షలకు దిగుతన్నం. అయినా సర్కార్ దిగిరాకపోతే మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతం.
– బీ శ్యామ్, టీజీవో ప్రధాన కార్యదర్శి