హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : ఎన్నికలకు ముందు ఎడా పెడా హామీలిచ్చి.. అది చేస్తాం.. ఇది చేస్తామంటూ ఆశచూపి మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుపై ఉద్యోగులు సమరానికి సిద్ధమయ్యారు. ఇంతకాలం ఓపిక పట్టిన సంఘాలు సర్కారుపై జంగ్కు సిద్ధమయ్యాయి. మొద్దునిద్రలో ఉన్న సర్కారుపై పోరుకు కార్యాచరణ ప్రకటించాయి. ఆగస్టు నెలంతా ఉద్యోగులు ఉద్యమించనున్నారు.
ఇప్పటికే కొన్ని సంఘాలు, జేఏసీలు కార్యాచరణ ప్రకటించగా, ఆగస్టు 15 తర్వాత భారీ ఉద్యమానికి ఉద్యోగ సంఘాల జేఏసీ సిద్ధమవుతున్నది. పెన్షనర్లు పోరుబాట పట్టారు. ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనను ఉధృతం చేశాయి. ఇలా ఒక్కో సంఘం, జేఏసీలు సర్కారును గడగడలాడించేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ 17 నెలల కాలంలో ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదు. డిమాండ్లకు పరిష్కారం చూపలేదు.
57 డిమాండ్లు, 200కు పైగా సమస్యల్లో పరిష్కరించినవి శూన్యం. పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యిది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడం, జీపీఎఫ్ బకాయిలు విడుదల కాకపోవడంతో పిల్లల పెండ్లిళ్లు చేయలేని పరిస్థితులున్నాయి. నెలకు రూ.700కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పి విడుదల చేయకపోవడం, రెండు డీఏలిస్తామని ఒకటే డీఏ ఇవ్వడం, ఈహెచ్ఎస్ జీవోను అమలుచేయకపోవడం వంటి పరిణామాలతో ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఇలా అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. ఎడా పెడా ఉచితాలు ఇస్తుండటం, ఉద్యోగులకు హక్కుగా, న్యాయంగా అందాల్సినవి ఇవ్వకపోవడంపై ఉద్యోగులు రగిలిపోతున్నారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంలో సర్కారు వైఫల్యాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నది. ఆగస్టు 15లోగా తమ సమస్యలు పరిష్కరించాలని అల్టిమేటం జారీచేసింది. అంతలోపు సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 15 తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు దశలవారీగా ఉద్యమిస్తామన్నారు. 57 డిమాండ్లు, రెండు వందలకు పైగా సమస్యలపై 200కు పైగా సంఘాలతో కూడిన జేఏసీ ఆగస్టు 15 తర్వాత ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నది.
టీచర్ల సమస్యల్లో సర్కారు నిర్లిప్త వైఖరిని నిరసిస్తూ.. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మూడు దశల ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. 16 ఉపాధ్యాయ సంఘాలతో కూడిన యూఎస్పీఎస్సీ ఉపాధ్యాయుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం ఆందోళనలకు సిద్ధమయ్యింది. ప్రభుత్వం ఏర్పడి 17నెలలు గడిచినప్పటికీ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారం కాకపోవడం, మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ఎన్నికల హామీలు అమలు కాకపోవడంతో యూఎస్పీఎస్సీ పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్న నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే గత నెల 23, 24 తేదీల్లో తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఇక ఈ నెల 5న(మంగళవారం) 33 జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నారు. 23న హైదరాబాద్ ధర్నాచౌక్‌లో మహాధర్నా తలపెట్టారు.
రాష్ట్రంలోని పెన్షనర్లు పోరుబాట పట్టారు. 50కి పైగా పెన్షనర్ల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల సంఘాల సమన్వయ కమిటీగా ఏర్పడ్డాయి. ఈనెల 10 వరకు 10 డిమాండ్లను పరిష్కరించాలని సర్కారుకు అల్టిమేటం జారీచేశాయి. అయినా సర్కారులో కదలిక లేకపోవడంతో ఈ నెల 11న చలో హైదరాబాద్ – ఇందిరాపార్క్‌లో మహాధర్నాకు పిలుపునిచ్చాయి. మూడు లక్షల మంది పెన్షనర్లతో హైదరాబాద్‌లో కదం తొక్కుతామని సమన్వయ కమిటీ నేతలు హెచ్చరించారు. విద్యుత్తు సంస్థల్లోని అర్టిజన్ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు.
ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీగా ఏర్పాటయ్యారు. జూలై 14 నుంచి సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే కార్మికశాఖ కల్పించుకుని చర్చలకు పిలిచింది. దీంతో సమ్మె వాయిదాపడింది. చర్చలు సఫలం కాకపోతే సమ్మెకు సిద్ధమని జేఏసీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వశాఖల్లోని 25వేలకు పైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమయ్యింది. ఇందుకు ఓ కమిటీని కూడా వేసింది. ఈ కమిటీ నివేదిక అందగానే ఈ ఉద్యోగులను తొలగించనుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం దీనిని నిరసిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నది.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాలిట గుదిబండగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దుకోసం టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి పోరాటానికి సిద్ధమయ్యారు. పీఆర్టీయూ టీఎస్ పక్షాన భారీ కార్యాచరణ ప్రకటించారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమ కార్యాచరణను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో మహాధర్నా తలపెట్టారు. ఈ ధర్నాకు 10 వేల మంది హాజరవుతారని శ్రీపాల్‌రెడ్డి ప్రకటించారు.
డీఎస్సీ-2003 టీచర్లకు సీపీఎస్‌కు బదులు పాత పింఛన్ అమలుపైనా సీపీఎస్ టీచర్లు ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఇటీవలే హైకోర్టు 2003 డీఎస్సీ టీచర్లు పాత పింఛన్‌కు అర్హులేనని తీర్పు ఇచ్చింది. 20 ఏండ్లుగా నిరీక్షిస్తున్న టీచర్లంతా కోర్టు తీర్పు అమలుకోసం కండ్లుకాసేలా వేచిచూస్తున్నారు. కానీ సర్కారు ఈ విషయంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ నేపథ్యంలో 2003 డీఎస్సీ టీచర్లు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.