హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): సీపీఎస్ ఉద్యోగులను కాంగ్రెస్ సర్కారు దగా చేస్తున్నా ఉద్యోగ సంఘాల నాయకులు మౌనం వహించడంపై విస్మయం వ్యక్తమవుతున్నది. వారి తీరుపై సగటు ఉద్యోగుల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఇంత అన్యాయం జరుగుతున్నా నేతలు మొద్దునిద్రలో ఉండటమేమిటని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉద్యోగులను సర్కారు ఇంతగా చీట్ చేస్తున్నా.. స్పందించరా ? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 2.2 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులున్నారు. సీపీఎస్ కింద సర్కారు వాటాను, ఉద్యోగి వాటాను ప్రభుత్వం ప్రాన్ అకౌంట్లలో జమచేయని విషయం తెలిసిందే.
గత 13 నెలలుగా రూ.2,600 కోట్లను ప్రభుత్వం సొంతానికి వాడుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఉద్యోగ సంఘాల నాయకులు, పెద్దన్న పాత్ర పోషించాల్సిన జేఏసీ నేతలు ఈ విషయంపై స్పందించకపోవడం పట్ల ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీపీఎస్ రద్దుకు పోరాడతామని హామీనిచ్చిన ఎమ్మెల్సీలు గెలవగానే ఈ విషయాన్ని మరిచిపోయారని, ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ఎమ్మెల్సీలంతా ఎక్కడికి పోయారని ఓ టీచర్ అసహనం వ్యక్తంచేశారు.
సీపీఎస్ ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ను ప్రభుత్వం ప్రాన్ అకౌంట్లలో జమచేయడంలేదని, తన అవసరాలకు వాడుకుంటున్నదని ఉద్యోగుల్లో చాలామందికి తెలియదు. ‘మా జీతం నుంచి కట్ అవుతుంది.. సర్కారు వాటా కలిపి ప్రాన్ అకౌంట్లో జమచేస్తుంది’ అనే చాలామంది భావిస్తున్నారు. కానీ ప్రభుత్వం జమ చేయడంలేదన్న విషయం వెలుగులోకి రాగానే చాలా మంది హుతాశులయ్యారు. వెంటనే ప్రాన్ అకౌంట్లను చెక్‌చేసుకుని విస్తుపోతున్నారు. మంచిర్యాల జిల్లాలో పనిచేసే ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ ‘అయ్యో నా వాటా నెలనెలా జమ అవుతున్నదని అనుకున్నా! నా పైసలెక్కడికి పోతాయి.. ప్రాన్ అకౌంట్లోనే ఉంటాయనుకున్నా ! మా నాయకులకు తెలిసి కూడా మాకు చెప్పలేదంటే ఎంత ఘోరమిది’ అంటూ వాపోయారు. ఒకటో తారీఖు జీతమిస్తున్నామని చెప్పి ఇంత మోసం చేస్తారా? అంటూ సర్కారును నిలదీశారు.
ఉద్యోగ సంఘాల నేతలు సీఎం రేవంత్‌రెడ్డి ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ ట్రాప్‌లో పడిపోయారని ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. ‘మొత్తం ఖజానా మీకే ఇస్తా ఎట్ల పంచుదామో చెప్పుండ్రీ. నన్ను కోసుకు తిన్నా రూపాయిలేదు’ అన్న సీఎం మాటల ట్రాప్‌లో సంఘాల నేతలు పడిపోయారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఉద్యమించాల్సిన వారు.. పోరాటం చేయాల్సిన వారు మిన్నకుండిపోయారని గగ్గోలుపెడుతున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంపై ఓ ఉద్యోగ సంఘ నాయకుడిని అడిగితే ఒక డీఏ ఇప్పించేందుకే అష్టకష్టాలు పడ్డం. ఇంకేం చేయగలం భాయ్ అంటూ ఊస్సూరుమన్నారట. సీఎం ట్రాప్‌లో పడ్డారనేందుకు ఇంత కన్నా ఏం చెప్పగలమంటూ సదరు ఉద్యోగి అసహనం వ్యక్తంచేశారు. ‘57 డిమాండ్లు ముందుపెడతరు. రెండు వందలకు పైగా సమస్యలంటరు. ఒక డీఏ ఇవ్వగానే చల్లబడుతరు. ఇదేం పోరాటం’ అంటూ ఉద్యోగులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు.
సీపీఎస్ రద్దు కోసం ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఉద్యోగులు పోరాడుతున్నారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లో ఉద్యోగులు పోరాడి పాత పెన్షన్‌ను సాధించారు. సీపీఎస్ రద్దు కోసం ఏపీ ఉద్యోగులు పెద్దపోరాటమే చేశారు. సీపీఎస్‌కు బదులుగా ఏపీ ప్రభుత్వం గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం ను తీసుకొచ్చింది. దీనిని ఉద్యోగులు వ్యతిరేకించారు. ఉద్యోగులు, టీచర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో సర్కారు జీపీఎస్‌పై వెనక్కి తగ్గింది. ఈ సోయి మన నాయకులకెందుకు లేదని ఉద్యోగులు నిలదీస్తున్నారు. ఒక వాట్సాప్ గ్రూపులో అంతా సీపీఎస్ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై, సీపీఎస్ రద్దుపై పోరాటం చేద్దాం ఏమంటారని ఒకరు పోస్టు పెడితే నాయకత్వం నుంచి స్పందన కరువయ్యిందట.
ఉద్యోగుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర ఉద్యోగ సంఘాలది. గతంలో ఒక రూపాయి డీఏ కోసం 50 రోజులకు పైగా సమ్మె చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు లక్షల రూపాయలు నష్టపోతున్నా పట్టించుకోరా ? అంటూ ఉద్యోగులు నిలదీస్తున్నారు. రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు ఐక్యపోరాటలు చేసిన సర్కారుకు ముచ్చెమటలు పట్టించాయి. 610 జీవోను సాధించిందే ఉద్యోగ సంఘాలు. మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలోను ఉద్యోగ సంఘాలు ముందుండి కొట్లాడాయి. సకల జనుల సమ్మెకు దిగాయి. సమ్మె కాలానికి వేతనాన్ని సాధించాయి. సీపీఎస్ రద్దు సహా ఉద్యోగులకు జరుగుతున్న నష్టంపై ఉద్యోగ సంఘాలు, జేఏసీలు ఎందుకు పోరాడటం లేదని సగటు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
సీపీఎస్ పరిస్థితి ఇలా ఉంటే ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్)పై ఉద్యోగుల్లో అనుమానాలొస్తున్నాయి. ఈహెచ్ఎస్ స్కీంలో నమోదైన ఉద్యోగుల వాటాను కూడా సీపీఎస్ లాగే ప్రభుత్వం నొక్కేస్తుందా? అన్న అనుమానాలు ఉద్యోగులను పీడిస్తున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లకు ఈహెచ్ఎస్ స్కీంను అమలుచేయాలని ఇటీవలే క్యాబినెట్లో సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానల్లో ఉద్యోగులకు పూర్తిగా నగదు రహిత చికిత్సనందించే పథకమిది. ఈ స్కీం అమలుకు ఈహెచ్ఎస్ ట్రస్టును ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రతి నెలా ఉద్యోగులు, పెన్షనర్ల మూలవేతనం నుంచి ఒక శాతం, ప్రభుత్వం ఒక శాతం చొప్పున ఈ ట్రస్టులో జమచేస్తారు. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుం బ సభ్యుల చికిత్సకు అయిన మొత్తాన్ని ఈ ట్రస్టు నుంచి చెల్లిస్తారు. ప్రతి నెల రూ.200 కోట్ల వరకు ఈ ట్రస్టులో జమ అవుతాయన్న అంచనాలున్నాయి. ఇప్పటికే సర్కారు పింఛన్ వాటానే సరిగ్గా చెల్లించలేకపోతున్నది. ఉద్యోగుల వాటా ను వాడుకుంటున్నది. ఈ పరిస్థితుల్లో ఈహెచ్ఎస్ వాటాను ఉద్యోగులు జమచేస్తే, సర్కారు వాటా వస్తుందన్న నమ్మకంలేదని అంటున్నారు.
సీపీఎస్ ఉద్యోగులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా మోసం చేస్తున్నాయి. రాష్ట్రం చందా (వాటా) కట్టకపోతే.. కేంద్ర ప్రభుత్వం మిన్నకుండిపోవడం అత్యంత దారుణం. ఇంత అన్యాయం జరుగుతుంటే రాష్ట్రంలోని రెండు ఉద్యోగ జేఏసీలు పట్టించుకోకపోవడం గర్హనీయం. ఇప్పటికైనా రెండు ఉద్యోగ జేఏసీలు సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం న్యాయం చేసేలా ఉద్యమ కార్యాచరణను ప్రకటించాలి.
– దాముక కమలాకర్, తెలంగాణ సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు