హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో 317 జీవో రద్దయ్యే వరకు పోరాడుతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ప్రకటనపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) సంగతేంటని ఆయనను ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా 86 లక్షల మంది ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దుచేయరా? అని నిలదీస్తున్నారు. సీపీఎస్ రద్దు కోసం పలు రాష్ర్టాల్లో ఆందోళనలు కొనసాగుతున్నా నరేంద్రమోదీ సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ‘ఉద్యోగుల కేటాయింపులో సీనియార్టీని పరిగణనలోకి తీసుకోవాలన్నది మీ ప్రభుత్వమే కదా? ఉద్యోగుల పట్ల నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే డీవోపీటీ మార్గదర్శకాల్లో స్థానికతను చేర్చవచ్చుకదా?’ అంటూ ఫైర్ అవుతున్నారు.
సీపీఎస్ వద్దని 86 లక్షల మంది ఉద్యోగులు పోరాడుతున్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. వారి వెతలు బీజేపీకి పట్టవా? ఉద్యోగుల విషయంలో మీ చిత్తశుద్ధి ఏడబోయింది? వ్యవసాయ చట్టాలను రద్దుచేసినట్టు సీపీఎస్‌ను రద్దు చేయవచ్చకదా?
నరేందర్‌రావు, టీఎస్సీపీఎస్ఈయూ ఎంప్లాయిస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు
సీపీఎస్ రద్దు కోసం ఏడేండ్ల నుంచి పోరాడతున్నాం. బీజేపీ ప్రభుత్వం ఎన్నడైనా మమ్మల్ని పట్టించుకున్నదా? నడ్డా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వినతి పత్రం ఇచ్చాం. అయినా ఈ ఉలుకూ పలుకూ లేదు.
దాముక కమలాకర్, సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు