చిక్కడపల్లి, సెప్టెంబర్ 1: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన లచ్చిరెడ్డి మాట్లాడుతూ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు శాపంగా మారిందని అన్నారు. ఉద్యోగులకు పెన్షన్ భిక్ష కాదు కనీస హక్కు అని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగుల కు భద్రత కల్పించాల్సి బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ప్రభుత్వంపై ఎలాంటి భారం పడదని కాబట్టి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. పెన్షన్ గౌరవప్రదంగా జీవించే హక్కులో భాగమని చెప్పారు. సీపీఎస్ ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు కే రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నిక ల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, జేఏసీ నాయకులు ఉపేందర్, కే రాములు, బాణాల రాంరెడ్డి, పాక రమేశ్, డాక్టర్ జీ నిర్మల, అశ్వత్థామరెడ్డి, డాక్టర్ కత్తి జనార్దన్, హబీబ్ మస్తాన్, గరికె ఉపేందర్‌రావు, ఎస్వీ సుబ్బయ్య, మహిపాల్‌రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.