కొల్లాపూర్, సెప్టెంబర్ 12: ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు (Save RTC) కార్మికులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేయాలని, విద్యుత్ బస్సులను ఆర్టీసీ నిర్వహించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇవ్వాలని, విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఆర్టీసీ ఆస్తులను ప్రవేటు సంస్థలకు అప్పజెప్పేందుకు సబ్సిడీ ఇవ్వడానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం కొల్లాపూర్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు తమ జేబులకు సేవ్ ఆర్టీసీ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. సిబ్బంది ధరించిన బ్యాడ్జిలలో..
1. విద్యుత్ బస్సులలో మార్పులు చేయాలి, జీసీసీ మోడడల్ను రద్దు చేయాలి.
2. విద్యుత్ బస్సులను ఆర్టీసీయే కొని నిర్వహించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వాలు ఇవ్వాలి.
3. ఆర్టీసీ గ్యారేజ్‌లను అభివృద్ధి చేయాలి, అవసరమైన శిక్షణ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి.
4. బస్సుల నిర్వహణలో ఆదాయానికి, ఖర్చుకు మధ్య వస్తున్న తేడాను ప్రభుత్వాలే భరించాలి.
5. ఆర్టీసీని ప్రజా రవాణా సంస్థగా చూడాలి.
6. ప్రజల అవసరాల మేరకు బస్సులను సమకూర్చాలి.
7. అవసరమైన అన్ని పోస్టులలో రిక్రూట్మెంట్ జరపాలి, కాంట్రాక్ట్ విధానం రద్దుచేసి అన్ని పోస్టులను రెగ్యులర్ ప్రాతిపధికన నియమించాలి.
8. అన్ని కేటగిరీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. వేతన ఒప్పందాలను వెంటనే చేసి ఏరియర్స్‌తో సహా వెంటనే చెల్లించాలి.
9. ఆర్టీసీ ఆస్తుల నగదీకరణ నిలిపివేసి వాటిని సంస్థం అభివృద్ధికి ఉపయోగించాలి.
10. సామాజిక భద్రత పథకాలైన పీఎఫ్, ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ, సీసీఎస్‌లకు నిధులు ఇవ్వాలి అనే డిమాండ్లను పేర్కొన్నారు.
బ్యాడ్జీలు, వాటిలో ఉన్న అంశాలపై ప్రయాణికులు ఆరా తీస్తున్నారు. దీంతో ఆర్టీసీ పరిరక్షణలో ప్రయాణికులను సైతం భాగస్వామ్యం చేసే కార్యక్రమాన్ని చేసినట్లయింది. కొల్లాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులే కాక రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సేవ్ ఆర్టీసీ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైనట్లు వారు తెలిపారు. ఆర్టీసీని ప్రజా రవాణా సంస్థగా ప్రభుత్వం చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ వారికి సబ్సిడీ ఇస్తూ విద్యుత్ బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ ఆర్టీసీలో ఇప్పటివరకు 575 విద్యుత్ బస్సులు నడుస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ బస్సులు మారుమూల గ్రామాలకు సైతం నడుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేటు బస్సులు ఆదాయం వచ్చే మార్గాలలో మాత్రమే నడుపుతారని వారు వివరించారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం ప్రయాణికులు సైతం ముందుకు రావాలన్నారు. అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ప్రయాణికులు ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.