Mission Bhagiratha | హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘ఎవరికి పుట్టినవు బిడ్డా.. ఎక్కెక్కి ఏడుస్తున్నవ్’ అన్నట్టుగా ఉన్నది ‘మిషన్ భగీరథ’ ఉద్యోగుల దుస్థితి. 6-8 నెలలుగా వేతనాలు రాక వారు నానా అవస్థలు పడుతున్నా ఎవ రూ పట్టించుకోవడం లేదు. వేతనాలు ఇవ్వాలని ఆ అభాగ్యులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే.. తమకు సంబంధం లేదని, కాంట్రాక్టు ఏజెన్సీని అడగాలని అధికారులు చెప్తున్నారు. ఏజెన్సీని అడిగితే.. ప్రభుత్వం ఇవ్వడం లేదని, తాము ఏడికెళ్లి తేవాలని దబాయిస్తున్నారు. సహనం నశించిన కొందరు చిరుద్యోగులు వేతనాల కోసం ధర్నా చేస్తే.. రేపిస్తా, మాపిస్తామని కాలం గడుపుతున్నారే తప్ప ఇవ్వడం లేదు. దీంతో దసరా దగ్గర పడుతుండటంతో పైసలు చేతిలో లేక అనేక మంది ఉద్యోగులు మానసిక ఒత్తిడి అనుభవిస్తున్నారు. కొందరు ఆ ఒత్తిడి తాళలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఖమ్మం జిల్లా లో ‘మిషన్ భగీరథ’ లైన్ ఆపరేటర్ చందనబోయిన గాంధీ (35) మంగళవారం ఆత్మహ త్య చేసుకోవడం వారి నిస్సహాయస్థితి నిదర్శనం.
మంత్రి సీతక్క హామీ బట్టదాఖలు
‘మిషన్ భగీరథ’కు సంబంధించిన వివిధ విభాగాల్లో రాష్ట్రవ్యాప్తంగా 17 వేల మందికిపైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో 6-8 నెలలుగా జీతాలు అందడం లేదు. కొన్ని జిల్లాల్లో మార్చి నుంచి, మరికొన్ని జిల్లాల్లో మే నుంచి వేతనాలు రావడం లేదు. జీతాల చెల్లింపులో జాప్యం కారణంగా ఆ చిరుద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నారు. పంచాయతీరాజ్ విభాగంలో పనిచేస్తున్న చిరుద్యోగుల కు గ్రీన్ చానెల్ ద్వారా ప్రతినెల వేతనాలు చెల్లిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. కానీ, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆర్థికశాఖ పట్టించుకోవడం లేదని తెలిసింది.
కొద్దిపాటి వేతనమూ రావడం లేదు
సాధారణంగా ‘మిషన్ భగీరథ’ ఉద్యోగులకు ప్రతి నెలా రూ.18,000 జీతం రావాలి. కానీ, అందులో కాంట్రాక్టర్లు నానా రకాల కోతలు విధించి రూ.10-12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని ‘మిషన్ భగీరథ’ వరర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కా ర్యదర్శి వీ రాములు తెలిపారు. ప్రస్తుతం ఆ కొద్దిపాటి వేతనాలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను సంప్రదిస్తే.. ‘మిషన్ భగీరథ’ ఉద్యోగుల జీతాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ బాధ్య త కాంట్రాక్టర్లదేనని చెప్తున్నారని, కాంట్రాక్టర్లను అడిగితే పెండింగ్ బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపిస్తున్నారని వాపోయారు.
ధర్నాలు చేసినా పట్టించుకోవడం లేదు
నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రస్తుతం సామాన్యులు రెండు పూటలా సరైన తిండి తినడమే కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో 5-6 నెలలగా వేతనాలు రాకపోతే తమలాంటి వారు ఎలా బతకాలని ‘మిషన్ భగీరథ’ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు.. వేతనాల కోసం ఉద్యోగులు ధర్నాలు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని, దీంతో ఆర్థిక, మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేక కొందరు చిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏప్రిల్ నుంచి వేతనాలు రావడం లేదు
తాగునీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 76 కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 352 మంది ల్యాబ్ అసిస్టెంట్లు, ల్యాబ్ అటెండెంట్లు, కెమిస్టులు, మైక్రోబయాలజిస్టులు పనిచేస్తున్నారు. వారికి ఏప్రిల్ నుంచి వేతనాలు రావడం లేదు. ప్రతి నెలా ఇవ్వాల్సిన రూ.22 వేల వేతనంలో నానా రకాల కోతలు పెట్టి రూ.17-18 వేలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఎన్నడూ సక్రమంగా ఇచ్చింది లేదు. ప్రభుత్వ పెద్దలకు ప్రధాన ఆహారం కాంట్రాక్టు ఏజెన్సీలే. వాటి నుంచి 4 నుంచి 10% మేరకు కమీషన్ దండుకుంటున్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. దీంతో పండుగపూట చేతిలో పైసలు లేక మానసిక క్షోభతో చిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు దాపురించాయి.
-పుల్లగుర్ల రాజిరెడ్డి, రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్