హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్)పై సోమవారం చర్చిస్తామంటూ, విధివిధానాలను ఖరారు చేస్తామన్న కాంగ్రెస్ సర్కారు మళ్లీ వాయిదాల పర్వం.. సాగదీతలను పునరావృతం చేసింది. ఇతర రాష్ర్టాల్లో అధ్యయనమంటూ కొత్త మెలిక పెట్టింది. ఈహెచ్ఎస్పై సీఎస్ రామకృష్ణారావు సోమవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 7,14,323 మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. ఈ పథకం కోసం ఏటా రూ. 1,300కోట్లు అంచనా వ్యయం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్న వివిధ పథకాలు, ఇన్సూరెన్స్ కంపెనీల విధానాలను అధ్యయనం చేసి, సాధ్యమైనంత త్వరగా నివేదిక సిద్ధం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.
ఉద్యోగుల ప్రతిపాదనలు పక్కకు..
ఈహెచ్ఎస్ స్కీం అమలుకు కేసీఆర్ ప్రభుత్వం జీవో-186ను జారీచేసింది. ఉద్యోగులు, పెన్షనర్ల మూలవేతనం నుంచి ఒకశాతం, ప్రభుత్వం ఒకశాతం వాటాగా ఈహెచ్ఎస్ ట్రస్టుకు జమచేస్తారు. ఇలా ఏటా జమయ్యే మొత్తం నుంచి ఉద్యోగులకు నగదు రహిత చికిత్సనందించాలని ప్రతిపాదించారు. పాత జీవో-186ను అమలుచేస్తే చాలని ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా ప్రభుత్వానికి సూచించింది. కానీ ఇందుకు విరుద్ధంగా రేవంత్ సర్కారు నడుచుకుంటున్నది.