హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రోడ్లు భవనాల శాఖను పునర్వ్యవస్థీకరించాలన్న ప్రభుత్వం నిర్ణయంపై ఆ శాఖ ఇంజినీర్లు, ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా తమ శాఖలో పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టడాన్ని స్వాగతిస్తూ శనివారం ఎర్రమంజిల్‌లో ఆర్అండ్బీ ప్రధాన కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ ఇంజినీర్స్ అసొసియేషన్ అధ్యక్షుడు వీ బాలప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వా త తమ శాఖ పునర్వ్యవస్థీకరణకు నోచుకోలేదని, తాజాగా ఈ ప్రక్రియను చేపట్టడంతో పోస్టుల పెంపు, కొత్త పోస్టులు మంజూరుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్అండ్బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఈలు, ఎస్ఈలతో ఇదే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించడం శుభసూచకమన్నారు. పునర్వ్యవస్థీకరణతో సర్కిళ్లు, డివిజన్ల సంఖ్య పెరిగి పటిష్ట పర్యవేక్షణకు అవకాశం కలుగుతుందని, ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయని బాలప్రసాద్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్, ఉపాధ్యక్షురాలు సంధ్యారాణి ఆర్అండ్బీ ఎన్జీవోల ఫోరం అధ్యక్షుడు ఎన్ జనార్ధర్రావు, కార్యదర్శి పూర్ణచందర్రావు, జాకీర్‌హుస్సేన్, మహిళా సంఘం నాయకులు దివ్య, జ్యోత్స్న పాల్గొన్నారు.