హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారుపపై ఉద్యోగులు జంగ్కు పిలుపునిచ్చారు. తమ సమస్యలు, డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. హక్కుల సాధన, డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 28 నుంచి జనవరి 30 వరకు పోరుబాట పట్టనున్నట్టు వెల్లడించింది. అక్టోబర్ 23 నుంచి నుంచి జనవరి 30 వరకు జేఏసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. మొత్తంగా నాలుగు నెలల పాటు సర్కారుపై దశలవారీగా ఉద్యమించనున్నట్టు తెలిపింది. ఈ నెల 26న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించి పరిష్కరించాలని, తమను చర్చలకు పిలవాలని లేదంటే మరో ఉద్యమం తప్పదని జేఏసీ నేతలు అల్టిమేటం జారీచేశారు.
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్‌కు సంబంధించిన సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాకపోవడంతో విసిగివేసారిన ఉద్యోగులు సమరశంఖం పూరించారు. జేఏసీ జెండా కింద పోరాటానికి సిద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీవోభవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసిన జేఏసీ నేతలు, అనంతరం పోరాటాలే శరణ్యమని తేల్చి, ఉద్యమ కార్యాచరణను ఖరారుచేశారు.
అనంతరం టీఎన్జీవో భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఉద్యోగుల జేఏసీ కార్యాచరణను ప్రకటించారు. 206 సంఘాలతో కూడిన జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటంలో రాష్ట్రంలో ఉద్యోగులంతా భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీలు, ఉద్యోగులకు సంబంధించిన 46 డిమాండ్లు మొత్తంగా 50 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని అల్టిమేటం జారీచేశారు. జనవరి తర్వాత కూడా డిమాండ్లను పరిష్కరించకపోతే, చర్చలకు ఆహ్వానించకపోతే పెన్‌డౌన్ సహా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. జేఏసీ నాయకులు ఎస్ఎం ముజీబీ హుస్సేనీ (టీఎన్జీవో), ఏ సత్యనారాయణ (టీజీవో), దామోదర్‌రెడ్డి (పీఆర్టీయూ టీఎస్), సదానందంగౌడ్ (ఎస్టీయూ), డాక్టర్ పీ మధుసూదన్‌రెడ్డి (ఇంటర్ విద్యా జేఏసీ), రవీందర్‌రెడ్డి (ట్రెసా), పర్వతి సత్యనారాయణ (పీఆర్టీయూ తెలంగాణ) సహా ఇతర సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఉద్యోగుల జేఏసీ కార్యాచరణ
ఉద్యోగులకు గౌరవంలేదు
మా డిమాండ్ల సాధనకు మేం ఎక్క ని ఆఫీసులేదు. తొక్కని గడపలేదు. ప్రభుత్వాన్ని కలిసేందుకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడంలేదు. మమ్మ ల్ని చర్చలకు ఆహ్వానించలేదు. అసలి రాష్ట్రంలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలకు గౌరవమే ఇవ్వడంలేదు. సంఘాలకు ప్రభుత్వ గుర్తింపునివ్వడంలేదు. సీఎం రేవంత్ చొరవ తీసుకుని, మమ్మ ల్ని చర్చలకు ఆహ్వానించాలి. 26న జరిగే మంత్రివర్గ సమావేశంలో మా సమస్యలపై చర్చించి పరిష్కరించాలి.
– మారం జగదీశ్వర్, జేఏసీ చైర్మన్
తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉద్యమ కార్యాచరణ
గతంలో ఒక డీఏ పెండింగ్‌లో ఉంటేనే సమ్మెకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఐదు డీఏలు కలిపితే 17.21% పెండింగ్‌లో ఉంది. పీఆర్సీ 18 నెలలు ఆలస్యమైంది. ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. అయినా మేం ఇన్నాళ్లు ఓపికపట్టాం. మాపై భౌతికదాడులకు దిగుతామని మా ఉద్యోగులే హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మేం ఉద్యమ కార్యాచరణను ప్రకటిం చాం. జనవరి తర్వాత డిమాండ్లు పరిష్కారం కాకపోతే మరో కార్యాచరణను ప్రకటిస్తాం.
– ఏలూరి శ్రీనివాసరావు, జేఏసీ సెక్రటరీ జనరల్