కృష్ణకాలనీ, జూన్ 29 : కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక సింగరేణి సంస్థలోని ఉద్యోగులు, కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఉద్యోగులు ఏరియా జీఎం కార్యాలయం ఎదుట సోమవారం రిలే దీక్షచేపట్టారు. వారి దీక్షకు టీబీజీకేస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండ్ర సంఘీభా వం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. కోల్ ఇండియా ఉద్యోగులు చేస్తు న్న పనినే, సింగరేణి ఉద్యోగులు సైతం చేస్తున్నారని, కోల్ ఇండియా మాదిరిగా సింగరేణి ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఉద్యోగులు పది రోజులుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే యాజమాన్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప ట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. కేంద్ర కోల్మంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి సింగరేణిలో ఆందోళనలు కన్పించడం లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, కార్మికులు, అధికారులు సైతం రోడ్లెకి ధర్నా చేయాల్సిన దీనస్థితి వచ్చిందని మండిపడ్డారు. అయినా యాజమాన్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో అధికారులు రిలే దీక్షకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.