హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : ఇదంతా చూస్తుంటే. ‘చెల్లికి పెళ్లి, జరగాలి మళ్లీ మళ్లీ’ అనే సినీ డైలాగ్ గుర్తుకొస్తుంది. ఉద్యోగ సంఘాలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం గొంతెత్తిన ప్రతిసారీ ప్రభుత్వం ‘కమిటీ’లను తెరమీదికి తెస్తున్నది. నిరుడు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు ఏకమవగానే.. చర్చల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు.
ఉద్యోగులు శాంతించకపోవడంతో సీఎం వారితో చర్చలు జరిపారు. ఆ తర్వాత ప్రత్యేక కమిటీ, ఉపసంఘం అంటూ హడావుడి చేసినా ఇప్పటివరకూ పురోగతి లేదు. ఇప్పుడు మరోసారి ఉద్యోగులు ఉద్యమించేందుకు సిద్ధం కావడంతో మరోసారి కాలయాపన కోసం మరో కమిటీని వేశారు.సీఎం రేవంత్ ఇటీవల ఓ కార్యక్రమంలో ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలు వివాదా స్పదమ య్యాయి. సీఎం వ్యాఖ్యలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. తామేదో ప్రభుత్వాన్ని పీక్కుతింటున్నట్టు ప్రజల దృష్టిలో తమను విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
2024 మార్చి 10 : ఎంసీహెచ్చార్డీలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో సీఎం సమావేశమై వినతులను స్వీకరించారు.
2024 మార్చి 15 : ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల వినతులను పరిశీలించి, వారి సమస్యల పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి నేతృత్వంలోకమిటీ వేయాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.
2024 నవంబర్ 8 : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత కే కేశవరావును సభ్యులుగా నియమించారు.
2025 మే 6 : ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం కొత్తగా ముగ్గురు అధికారులతో కమిటీని నియమించింది. దీనికి రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ నేతృత్వం వహిస్తారు.