హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గిగ్‌వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించింది. ఆ అభాగ్యుల సంక్షేమం కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామన్న హామీని తుంగలో తొక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి రెండేండ్లు కావస్తున్నా ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఏజెన్సీల చేతిలో ఎంతోమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మోసపోతున్నారు. తమ సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏమైందని రేవంత్ సర్కారును నిలదీస్తున్నారు. గిగ్‌వర్కర్ల మాదిరిగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి డీ శ్రీధర్ డిమాండ్ చేశారు.
మట్టిబిడ్డలను పట్టించుకోరా?
తెలంగాణలోని గిగ్వర్కర్లల్లో అత్యధికులు ఇతర రాష్ర్టాలవారే. స్విగ్గీ, జో మాటో, ఓలా, ఊబర్ తదితర సంస్థల్లో పనిచేస్తున్నా వీరిలో బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ర్టాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. వారి సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర సర్కారు ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విస్మరించడం గర్హనీయమని ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రమాదవశా త్తూ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఎవరైనా మరణించినా, వైకల్యానికి గురైనా ప్రభుత్వం, ఏజెన్సీలు ఒక్క రూపాయి కూడా ఇవ్వడంలేదని, కనీసం పెన్షన్, గ్రాట్యుటీ కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి లక్షన్నర మందికిపైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులున్నారు. వారిలో కొందరిని ప్రభుత్వ శాఖలు నేరుగా నియమించుకోగా, మరికొందరిని మ్యాన్‌పవర్ ఏజెన్సీల ద్వారా నియమించారు. వారికి సంబంధిత ఏజెన్సీలు నెలలు తరబడి వేతనాలు చెల్లించడం లేదు.