హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ బిల్లుల కోసం రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడంలేదు. నెలనెలా ఎప్పుడొస్తాయని వేచిచూడక తప్పడంలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలు పూర్తిగా అందడంలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సం బంధించిన బిల్లులు మొత్తం క్లియర్కావడంలేదు. నెల నెలా విడుదల చేస్తున్నవి ఏ మాత్రం సరిపోవడంలేదని, ఉద్యోగ సం ఘాలు అంటున్నాయి. విడుదల చేస్తున్న మొత్తాన్ని రూ.700కోట్ల నుంచి రూ. 1,500 కోట్లకు పెంచాలని డిమాండ్ చేశా యి. అయితే ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను సర్కారు ఏ మాత్రం ఖాతరు చేయడంలేదు. పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించడంలేదు. బుధవారం పాత కథనే పునరావృతం చేసింది. దీంతో రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు కష్టాలు తప్పడంలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పడటంలేదని ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు గగ్గోలుపెడుతున్నారు. పెండింగ్ బిల్లుల్లో తమ వాటా ఎంతో చెప్పాలని సీపీఎస్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ‘ప్రతి నెలా వేస్తున్నామంటున్నారు. నాకింత వరకు రూపాయి రాలేదు. ఎవరికేస్తున్నారో.. ఏ ప్రాతిపదికన వేస్తున్నారో అర్థం కావడంలే దు..’ అని ఓ ఉద్యోగి వాపోవడం గమనా ర్హం. కొందరి ఖాతాల్లో పడుతుండగా, మరికొందరికి అస్సలు పడకపోవడంతో ఆయా ఉద్యోగుల్లో అశాంతి రగులుతున్నది.
ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో రూ. 713 కోట్లు విడుదల చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. డిసెంబర్ మాసంలో చెల్లించాల్సిన మొత్తాన్ని బుధవారం విడుదల చేశామని తెలిపారు. ఉద్యోగ సంఘాలకు ప్రతి నెలా రూ. 700కోట్ల చొప్పున విడుదల చేస్తామని హామీ ఇచ్చామని, ఈ మేరకు నెల నెలా విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. తొలుత జూన్‌లో రూ. 183కోట్లు, ఆగస్టు నుంచి నవంబర్ వరకు ప్రతి నెలా రూ. 700కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులు విడుదల చేశామని, తాజాగా డిసెంబర్‌కు సంబంధించి రూ. 713కోట్లు విడుదల చేశామని వెల్లడించారు.
పెండింగ్ బిల్లుల విడుదల విషయంలో కాంగ్రెస్ సర్కారు ఉద్యోగ, ఉపాధ్యాయులను దారుణంగా మోసం చేస్తున్నది. పాత పెండింగ్ బిల్లులను విడుదల చేయడంలేదు. కేవలం 2024 నుంచి గల బిల్లులను మాత్రమే విడుదల చేస్తున్నట్టు ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. వాస్తవానికి ఒక పద్ధతి ప్రకారం పాత తేదీ నుంచి బిల్లుల చెల్లింపులు చేయాలి. కానీ 2024 నుంచి పెండింగ్‌లో ఉన్నవే చెల్లిస్తున్నట్టు ఉద్యోగులు వాపోతున్నారు. గతంలో సీపీఎస్ బకాయిలు బిల్లులు చేశారు. ఇవి సబ్ ట్రెజరీల్లో మూలుగుతున్నాయి. వీటిని పక్కనపెట్టారు. ఆ తర్వాత జీపీఎఫ్ బకాయిలు చెల్లింపులు చేస్తున్నారని మండిపడుతున్నారు.