హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణలకు సంబంధించి పీఆర్సీ నివేదిక సిద్ధమైనా స్వీకరించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తున్నది. ప్రభుత్వ వైఖరి ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నదని చర్చ నడుస్తున్నది. సర్కారు వైఖరి ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త పీఆర్సీ ఇప్పట్లో లేనట్టేనా? అనే ఆందోళన వ్యక్తమవుతున్నది. పీఆర్సీ ప్రయోజనాలు ఇవ్వడం ప్రభుత్వానికి ఇష్టంలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి పీఆర్సీ గడువు 2023 జూన్ 30వ తేదీతో ముగిసింది. 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీని ఇవ్వాల్సి ఉంది. కేసీఆర్ సర్కారు 2023 అక్టోబర్లో వేతన సవరణ సంఘాన్ని నియమించింది. ఉద్యోగ సంఘాల నుంచి పీఆర్సీ ప్రతిపాదనలు స్వీకరించింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత కొన్ని నెలల క్రితమే పీఆర్సీ నివేదిక సిద్ధమైంది. రిపోర్టును సమర్పించేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో నిరీక్షించాల్సి వస్తున్నది. పీఆర్సీ నివేదిక అంటేనే సర్కారు జంకుతున్నదని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నివేదికను తీసుకోకుండా కాలయాపన చేస్తూ పీఆర్సీపై నెపం నెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు యత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు.
హామీలు నెరవేర్చలేక, ఆదాయాన్ని సమీకరించుకోలేక సర్కారు సతమతమవుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిట్మెంట్ ఆశాజనకంగా లేకపోతే ఉద్యోగవర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే పీఆర్సీ తేనెతుట్టెను కదిలించడం ఎందుకులే అనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టివిక్రమార్కతో సమావేశమైనప్పుడు కూడా పెండింగ్ బిల్లులపై హామీ ఇవ్వడం తప్ప, పీఆర్సీ ప్రస్తావనే చేయలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు.
తెలంగాణ మొదటి పీఆర్సీ సీఆర్ బిశ్వాల్ కమిటీ నివేదికలో 7.5 శాతం ఫిట్మెంట్ను సిఫారసు చేసింది. కానీ కేసీఆర్ సర్కారు 30 శాతం ఫిట్మెంట్ను ప్రకటించింది. ప్రభుత్వంపై ఏడాదికి రూ.12,595 కోట్ల అదనపు భారం పడినా, కరోనా కష్టాలు వెంటాడినా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్రను గుర్తించి, భారాన్ని భరించేందుకు సిద్ధపడింది. 2015లో 43 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అంతకంటే తక్కువ ఫిట్మెంట్ ఇస్తే అసలుకే మోసం వస్తుందని ప్రభుత్వవర్గాలు జంకుతున్నాయని ఉద్యోగనేతలు అంటున్నారు.
తెలంగాణ తొలి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగియగా, జూలై 1 నుంచి రెండో పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉంది. ప్రస్తుత పీఆర్సీలో పాత బకాయిలిస్తారా? ఎప్పుడిస్తే అప్పట్నుంచే వర్తింపజేస్తారా? అని ఉద్యోగుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఒక పీఆర్సీకి మరో పీఆర్సీకి మధ్యకాలానికి గల వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు 5 శాతం మధ్యంతర భృతిని ప్రకటించింది. ప్రస్తుతం రేవంత్ సర్కారు బకాయిలను మానిటరీ బెనిఫిట్స్ రూపంలో ఇస్తుందా? నోషనల్ బెనిఫిట్స్ రూపంలో ఇస్తుందా? అన్న సందిగ్ధంలో ఉద్యోగులున్నారు. ఇప్పటికే ఐదు డీఏలు పెండింగ్, పీఆర్సీలో జాప్యం, ఐఆర్ ఇవ్వకపోవడం, డీఏలు కూడా పెండింగ్లో పెట్టడంపై సర్కారుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఫిట్మెంట్ సిఫారసు 7.5%
కేసీఆర్ ప్రకటించించిన ఫిట్మెంట్ 30%
ప్రభుత్వంపై ఏడాదికి భారం రూ.12,595 కోట్లు
2015లో ఫిట్మెంట్ అమలు 43%