Pending Bills | హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు సంబంధించిన రూ.8వేల కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయని, వీటిని వెంటనే చెల్లించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీ నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నిలదీశారు. ఆయా సంఘాల జేఏసీ నేతలు శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. అత్యవసర బిల్లులతోపాటు మెడికల్ బిల్లులు ఉండటం గర్హనీయమని పేర్కొన్నారు. ఈ బిల్లుల విడుదలకు పైరవీలు, పర్సంటేజీలతో సంబంధం లేకుండా చెల్లించాలని కోరారు. హెల్త్‌కార్డులు ఇవ్వాలని, ఐదు డీఏలను చెల్లించాలని, పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వీటిపై స్పందించిన భట్టి మాట్లాడుతూ.. ఇక ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఏప్రిల్ నుంచి నెలకు 500 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులను క్లియర్చేస్తామని హామీ ఇచ్చారు.
టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కల్పించుకొని.. నెలకు రూ.వెయ్యి కోట్ల చొప్పున క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ సంఘాల నేతలు మారం జగదీశ్వర్, కస్తూరి, ముత్యాల సత్యనారాయణగౌడ్, వెంకటేశ్వర్లు, పుల్గం దామోదర్‌రెడ్డి, మారెడ్డి అంజిరెడ్డి, మణిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా)డిమాండ్ చేసింది. సప్లిమెంటరీ బిల్లులు, వాహన అద్దె చార్జీలు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు, సరెండర్ లీవులు, రిటర్మెంట్ బిల్లులు, మెడికల్ రీయింబర్స్మెంట్, జీపీఎఫ్, పీఆర్సీ ప్రయోజనాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున 11 అంశాలను డిప్యూటీ సీఎం భట్టి ముందుంచారు.