Employee Unions | హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): ‘ఎవరిపై సమరం.. నన్ను కోసుకుతిన్నానా దగ్గర పైసల్లేవు’అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ‘మేం బోనస్ అడగట్లేదు. సంక్షేమ పథకాలు ఆపి జీతాలు పెంచమనట్లే. మాకు రావాల్సిన డీఏలు ప్రకటించమనే అ డుగుతున్నాం. దాచుకున్న జీపీఎఫ్ సొమ్ములివ్వాలని కోరుతున్నాం. 14 నెలలుగా ఇవ్వని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడిగాం. బదిలీలు చేయమంటున్నాం. ఇది కూడా తప్పంటే ఎలా?’అంటూ ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ‘మాటిమాటికీ ఆర్థిక సంక్షోభంలో ఉన్నామంటారు.
మేం అడిగిన 57 డిమాండ్లల్లో 45 డిమాండ్లు ఆర్థికేతర డి మాండ్లే. వీటిని పరిష్కరించేందుకు కూడా కోసుకోవాల్నా?’అంటూ నిలదీస్తున్నారు. మా సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం ఒక్కసారి కూడా చర్చలకు పిలువకపోతే, మా సమస్యలు పరిష్కరించకపోతే ఏం లాభమని నిలదీస్తున్నారు. ‘మంత్రులను కలిసేందుకు వెళితే గంటల తరబడి వేచిచూడాల్సి వస్తున్నది. ఇదేనా మాకిచ్చే గౌరవం. మాకో గంట స మయం కేటాయిస్తే మా సమస్యలు చెప్పుకుంటామని మొత్తుకుంటుంటే, గంట సమయమిచ్చే తీరికలేదా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంటూ కడిగిపారేస్తున్నారు.
గత ప్రభుత్వ హయంలోనూ మేం పోరాటం చేశాం. 2018 సరూర్‌నగర్‌లో సభపెట్టి గత ప్రభుత్వాన్ని ప్రశ్నించినం. ఈ సభతోనే గత సీఎం చర్చలకు పిలిచారు. ఈ సభతోనే 30 శాతం పీఆర్సీ సాధించినం. మేం ఎన్నిసార్లు అడిగినా ప్రస్తుత మంత్రులు మమ్మల్ని ఒక్కసారి కూడా చర్చలకు పిలవలేదు. ఇప్పుడేమో చర్చిద్దామని సీఎం అంటున్నారు. మా ఉద్యమం ప్రజలపై కాదు. ప్రభుత్వంపైనే. ప్రజలు వరద కష్టాల్ల్లో ఉన్నప్పుడు సీఎంఆర్ఎఫ్కు వందకోట్లు ఇచ్చినం. మా ప్రయోజనాలనే అడుగుతున్నం. అదనపు బోనస్ అడగడంలేదు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది.
– మారం జగదీశ్వర్, ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్
ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలు ఆపమని మేమెక్కడా చెప్పలేదు. ఉద్యోగులుగా మేం దాచుకున్న జీపీఎఫ్ కూడా మాకివ్వకపోతే ఏం లాభం. గత ప్రభుత్వంలో రూ. 6వేలు కోట్ల జీపీఎఫ్ ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చాక రూ. 8వేల కోట్లు పెండింగ్‌లో ఉంది. ఈ ప్రభుత్వం కొలువుదీరి 16 నెలలైంది. ఇంకా పెండింగ్ బిల్లులు కూడా చెల్లించకపోతే ఎలా? ఏప్రిల్ నుంచి నెలకు రూ.600-800 కోట్ల పెండింగ్ బిల్లులు మంజూరుచేస్తామని మీ ప్రభుత్వమే చెప్పింది. మే నెల వచ్చింది. రూపాయి కూడా విడుదల చేయలేదు. దీనికి మీ బాధ్యత లేదా?
– పుల్గం దామోదర్‌రెడ్డి, జేఏసీ అదనపు సెక్రటరీ జనరల్
ఉద్యోగుల పట్ల సీఎం వ్యాఖ్యలు విచారకరం. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చి ఇప్పుడు మాట మార్చ డం, ప్రజల్లో ఉద్యోగులను పలుచన చేయడం సరికాదు. అంతా ఒక కుటుంబం అంటూనే ఉద్యోగులను బజారున పడేయడం సమజసం కాదు. అక్టోబర్ 24న జేఏసీ నేతలతో చర్చలు జరిపినప్పుడు ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇంత వరకు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమే జరగలేదు. సీఎం జేఏసీ ప్రతినిధులతో సమావేశమై, సమస్యలను పరిష్కరించాలి.
-చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
ఆర్థిక పరిస్థితి బాగాలేదని, నెలకు రూ.5 వేలకోట్లు వడ్డీలు కడుతున్నామంటేనే మేమింత కాలం సహనంతో వ్యవహరించాం. 16 నెలలు ఓపిక పట్టినం. మంత్రులను కలిస్తే మాతో మాట్లాడితే ఒట్టు. మంత్రులతో వేసిన సబ్ కమిటీ ఏమైంది. 6 నెలలుగా ఒక్కసారి పిలిచిన దాఖలాల్లేవు. మా సమస్యలేంటో ఓపికగా వినే పరిస్థితి లేదు. పది, ఇరవైసార్లు, వందసార్లు సమయమివ్వండి, చర్చించండి అంటూ వేడుకున్నా ఫలితం లేదు. మంత్రులు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మేం ఊరుకోవాల్నా? మౌనం వహించాల్నా?
– ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి