నల్లగొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల (Graduate MLC Bypoll) లెక్కింపు కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 26 మంది ఎలిమినేట్ అయ్యారు. 27వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ఎలిమినేషన్ రౌండ్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 220 ఓట్లు రాగా, టీఆర్ఎస్కు 139 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 118, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 76 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కాగా, ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపు కోటా ఓట్లను 1,55,095గా నిర్ణయించారు. దీంతో మల్లన్న గెలవాలంటే 32,282 రెండో ప్రాధాన్యత ఓట్లు కావాల్సి ఉండగా, రాకేశ్ రెడ్డి గెలుపునకు 50,847 ఓట్లు రావాల్సి ఉంది. ఈసారి 25,824 ఓట్లను చెల్లనవిగా అధికారులు గుర్తించారు.
ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వాస్తవ లెక్కలకు, నమోదు చేస్తున్న లెక్కలకు సరిపోలడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నది. కౌంటింగ్ టేబుల్ వద్ద ఓట్ల లెక్కింపునకు, ఆర్వో ప్రకటిస్తున్న ఓట్లకు తేడా ఉంటున్నదని, దానిని సరిచేయాలని ఈసీని కోరింది. ఈమేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి గురువారం రాత్రి బీఆర్కేఆర్భవన్కు వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొదటి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థికి ప్రయోజనం కలిగే విధంగా కౌంటింగ్ అధికారులు లెక్కలు వేస్తున్నారని ఆరోపించారు.
ఓట్ల లెక్కింపులో జరుగుతున్న అవకతవకలపై ఆర్వో దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ప్రయత్నించినప్పటికీ, నాలుగు గంటలపాటు కనీస స్పందన లేదని మండిపడ్డారు. మొదటి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపులో 3వ రౌండ్ 4వ హాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 533 ఓట్ల మెజార్టీ వస్తే, ఆ ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థికి జమ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 3వ రౌండ్ 3వ హాల్లో తుది ఓట్ల లెక్కలు సరిపోలడంలేదని పేర్కొన్నారు. 4వ రౌండ్లోనూ వాస్తవ లెక్కలకు, నమోదు చేస్తున్న లెక్కలకు సరిపోలడంలేదని, వీటిపై వెంటనే రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీచేయాలని సీఈవోను కోరారు. బీఆర్ఎస్ ఏజెంట్ల సంతకాలు లేకుండా, అభ్యర్థికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అభ్యర్థి, ఏజెంట్ల అభ్యంతరాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా లెక్కింపు చేస్తున్నారని కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు తీరు గందరగోళానికి దారితీసింది. కౌంటింగ్ అధికారులు పారదర్శకత పాటించడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అభ్యర్థులు, ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, ఆ పార్టీ ఏజెంట్లకు మాత్రమే ప్రాధాన్యమిస్త్తూ.. తమ అభ్యంతరాలను, అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని, తమ పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని పలువురు అభ్యర్థులు, ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ధర్మసమాజ్ పార్టీకి (డీఎస్పీ)కి చెందిన ఏజెంట్లు అధికారుల తీరును నిరసిస్తూ బుధవారం సాయంత్రం వాదనకు దిగారు. కౌంటింగ్ హాల్స్‌లో కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా అభ్యర్థుల్లో ఎక్కువమంది తొలిరోజు అధికారుల తీరు సరిగా లేదని ఆరోపించారు. గురువారం సాయంత్రం బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, పార్టీ ఏజెంట్లతో కలిసి మీడియా ముందుకొచ్చారు. రాకేశ్‌రెడ్డి తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ఆర్వోకు ఒక లేఖ అందజేసినట్టు తెలిసింది. ఇది జరుగుతున్న సమయంలో రిటర్నింగ్ అధికారి హరిచందన కౌంటింగ్ కేంద్రంలో అందుబాటులో లేరు. మరో మీటింగ్ ఉండటంతో బయటకు వెళ్లారని అక్కడ ఉన్న అధికారులు తెలిపారు.