ఖలీల్ వాడి, నిజామాబాద్ జూలై 23 : నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జిల్లా జనరల్ హాస్పిటల్లోని లిఫ్ట్ మొరాయించింది. బుధవారం ఉదయం దవాఖానలోని పై అంతస్తుల నుంచి రోగులు, వారి బంధువులు లిఫ్ట్ లో కిందికి వస్తుండగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. దాదాపు 15 మంది లిఫ్ట్ లో ఉండడం, అది మధ్యలో ఆగిపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు.
ప్రాణం కాపాడుకునేందుకు వచ్చిన రోగులకు ఊపిరి పోయేంత పని అయిందని భయాందోళనకు గురయ్యారు. దవాఖానలో సెక్యూరిటీ, లిఫ్ట్ విభాగాలను పర్యవేక్షించాల్సిన సిబ్బంది లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. లిఫ్ట్ బాయ్ లు లేకుండానే లిఫ్ట్ లో ప్రయాణించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రోగులు ఆరోపించారు. రోగుల ఆర్తనాదాలతో అప్రమత్తమైన సిబ్బంది అష్ట కష్టాలు పడి సమస్యను పరిష్కరించారు. ప్రభుత్వ దవాఖానలో పాలన అస్తవ్యస్తంగా ఉందని, పట్టించుకునే నాథులు కరువయ్యారని రోగులు ఆరోపించారు.