హైదరాబాద్ : ఇచ్చిన హామీలు పక్కన పెట్టి హైడ్రా(Hydra) పేరుతో రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైడ్రా కేసు నమోదు చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ముందు మీ పార్టీ నేతల నుంచే కూల్చివేతలు మొదలవుతే మంచిదని, ఆ దమ్ము మీకుందా అని సూటిగా ప్రశ్నించాడు.
మీ తమ్ముడు, మంత్రి పొంగులేటిపై కూడా అక్రమ నిర్మాణాలు ఆరోపణాల ఆరోపణలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్తో కట్టుకుని నష్టపోయిన వారికి ఎలాంటి హామీ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకరిద్దరు సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చి వేసి అలజడి సృష్టించడం కేవలం డైవర్ట్ పాలిటిక్స్ కోసమేనని విమర్శించారు. రాష్టంలో కబ్జా అయిన అసైన్డ్, దేవాదాయ, చెరువు శిఖం భూములపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.