Operation Gaja | మహారాష్ట్రలోని నాగుల్వాయి నుంచి ప్రాణహిత నది దాటి మూడు రోజుల క్రితం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి వచ్చి ఇద్దరిని పొట్టపెట్టుకున్న మదగజం శుక్రవారం సాయంత్రం ఎట్టకేలకు తిరుగుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం ఈ ఏనుడు బెజ్జూర్ మండలం కమ్మర్గాం-జిల్లెడ గ్రామాల మధ్య కొండల్లో కనిపించింది.
మూడు రోజుల క్రితం ప్రవేశించిన ఈ ఏనుగు చింతలమానేపల్లి మండలం బూరెపల్లిలో అల్లూరి శంకర్(55)ను, పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో కారు పోశన్న(65)ను బలితీసుకున్న విషయం విదితమే. సరిహద్దు మండలాల ప్రజలకు కునుకు లేకుండా చేసిన ఈ ఏనుగు ఆచూకీ కనిపెట్టేందుకు రెండు రాష్ట్రాల అధికారులకు కత్తి మీద సాములా మారింది. మహారాష్ట్రకు చెందిన బృందంతోపాటు జిల్లాలోని మూడు అటవీ శాఖ బృందాలు థర్మల్ డ్రోన్ల సాయంతో ఏనుగు జాడను గుర్తించాయి.
గురువారం రాత్రి కొండపల్లి సమీపంలో రోడ్డుపైకి వచ్చి బస్సుకు అడ్డుపడింది. శుక్రవారం ఉదయం కమ్మర్గాంలోని పల్లె ప్రకృతి వనంలో స్థానికులకు ఏనుగు కనిపించింది. సాయంత్రం మొర్లిగూడ అటవీ సమీపం నుంచి ప్రాణహిత నది తీరం దాటి మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లినట్టు డ్రోన్ కెమెరా ద్వారా నిర్ధారించుకున్నట్టు ఇన్చార్జి ఎఫ్ఆర్వో సుధాకర్ తెలిపారు. దీంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
– కుమ్రంభీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/బెజ్జూర్/ పెంచికల్పేట్