హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : ప్రతినెలా ఒకటో తేదీనే ఠంచన్‌గా జీతాలు పడే విద్యుత్తు సంస్థల్లో ఈనెల నాలుగో తేదీ దాటినా అందలేదు. ఇప్పటికీ ఖాతాల్లో జమకాలేదు. ఇంధనశాఖ మంత్రిగా, ఆర్థికశాఖ మంత్రే కొనసాగుతున్నా వేతనాలు ఇవ్వలేని నిస్సహాయత నెలకొన్నది. ఇప్పటి వరకూ 31వేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు జీతాల కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. రాష్ట్రంలో నాలుగు విద్యుత్తు సంస్థలు ఉన్నాయి. వీటిల్లో 51 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 31 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు కాగా, 20 వేల మంది ఆర్టిజన్లు ఉన్నారు. వీరే కాకుండా మరో 20 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. పింఛన్లు, జీతాల కోసం నాలుగు విద్యుత్తు సంస్థలకు రూ.700 కోట్లు అవసరమవుతున్నాయి.
వీరికి గతంలో ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలిచ్చిన దాఖలాలు ఉన్నాయి. బడ్జెట్ లేకపోవడంతో ఓవర్‌డ్రాఫ్ట్ (ఓడీ)కి తీసుకొచ్చి ఠంచన్‌గా వేతనాలిచ్చారు. ఎట్టకేలకు బుధవారం రాత్రి 20 వేల మంది ఆర్టిజన్లకు జీతాలు, మరో 20 వేల మంది పెన్షనర్లకు పింఛన్లను ఖాతాల్లో జమచేశారు. 31 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు అందనేలేదు. ఇందుకు మరో రోజులు పట్టనున్నట్టు సమాచారం. నాలుగు రోజులు గడిచినా రెగ్యులర్ ఉద్యోగులకు వేతనాలు జమ కాకపోవడం విద్యుత్తు సంస్థల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ జాప్యంతో ఈఎంఐలు, బ్యాంకు రుణాలు ఉన్న ఉద్యోగులు కలవరపడుతున్నారు.
విద్యుత్తు సంస్థల్లో ఏకపక్ష బదిలీలను నిరసిస్తూ ఇటీవలే విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో దక్షిణ డిస్కం కార్యాలయం ఎదుట ఉద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగులు, ఇంజినీర్లు కార్యాలయం ఎదుట భారీ స్థాయిలో నిరసన తెలిపారు. ఈ రెండేండ్ల కాలంలో విద్యుత్తు సంస్థల్లో చేపట్టిన అతిపెద్ద ధర్నా ఇదే కావడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఫలితంగా మొత్తం బదిలీలను వాయిదా వేశారు. ఈ ధర్నా కార్యక్రమం కొందరు పైస్థాయి అధికారులకు రుచించలేదట. తీవ్ర ఆగ్రహం తెప్పించిందట. ఈ నేపథ్యంలో జీతాలివ్వకుండా నిలిపివేశారన్న.. పెండింగ్‌లో పెట్టారన్న ప్రచారం విద్యుత్తు సంస్థల్లో జరుగుతున్నది. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇలా వేతనాలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని ఉద్యోగుల్లో చర్చ నడుస్తున్నది.