ఎగవేసిన ఒక్కో హామీ వెంటాడుతున్నది. దగా పడిన ఒక్కో వర్గం దండు కడుతున్నది. అధికారం కోసం అడ్డగోలుగా ఇచ్చిన హామీలు.. ఇప్పుడు తమ సంగతేందో తేల్చాలంటూ సవాల్ విసురుతున్నాయి. తెలంగాణలో అమలు చేస్తానన్న గ్యారెంటీలను గాయబ్ చేసి.. కేరళలో ఇస్తామంటూ గారడీ చేస్తున్న కాంగ్రెస్‌పై ప్రజావ్యతిరేకత రాజుకుంటున్నది. సబ్బండవర్ణాల్లో భాగమైన ఉద్యోగ, కార్మికులు సర్కార్‌పై సమరశంఖం పూర్తిస్తున్నారు. నేటినుంచి విద్యుత్తు ఆర్టిజన్లు సమ్మెకు దిగుతున్నారు. 9వ తేదీన చర్చలు విఫలమైతే ఏ క్షణాన్నైనా సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. ఇక పీఆర్సీ, డీఏల ధోకాతో రగులుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు 17 నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. రోజుకో సంఘం నిరసన గొంతుక విపిస్తున్నది. పూటకోచోట ప్రభుత్వ మోసంపై ఆందోళన కొనసాగుతున్నది.
హైదరాబాద్/హనుమకొండ, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ట్రాన్స్‌కో, జెన్కో, దక్షిణ డిస్కమ్, ఉత్తర డిస్కమ్ కంపెనీల పరిధిలోని 20 వేల మంది కార్మికులు సమ్మెకు దిగనున్నారు. విద్యుత్తు, ఆర్టిజన్, అన్మ్యాన్డ్, పీస్‌రేటు కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈజేఏఈ) ఆధ్వర్యంలో బుధవారం నుంచి సమ్మె చేపట్టనున్నారు. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని, వీరికి ఏపీఎస్ఈసీ రూల్స్ అమలుచేయాలని, టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్లలో అన్మాన్డ్ వర్కర్లను ఆర్టిజన్లలో విలీనం చేసుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.
విద్యుత్తు సంస్థల్లో 2016 డిసెంబర్ 4వ తేదీ కంటే ముందు అన్ని అర్హతలు ఉండి పనిచేస్తూ ఇప్పటికీ ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్లుగా గుర్తించాలని, విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న పీస్‌రేటు కార్మికులకు జీవో 11 ప్రకారం కనీస వేతనాలు అమలుచేయాలని, 2026 పీఆర్సీ అమలుచేయాలని కోరారు. తమ డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళన చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, చివరికి సమ్మె నోటీసు ఇచ్చామని, అయినా సర్కార్ స్పందించకపోవడంతో సమ్మె బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
తెలంగాణ విద్యుత్తు ఆర్జిజన్ ఎంప్లాయీస్ యాక్షన్ కమిటీ (టీవీఏఈ జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్ ఎదుట చలో వరంగల్ మహా ధర్నా జరిగింది. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కొన్ని రోజులుగా విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రభుత్వం, విద్యుత్తు యాజమాన్యం స్పందించకపోవడంతో ఈ నెల 8 నుంచి సమ్మెలోకి టీవీఏఈ జేఏసీ నాయకులు మహాధర్నాలో ప్రకటించారు. మహా ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా 6వేలకు పైగా కార్మికులు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం, యాజమాన్యం స్పందించకుంటే బుధవారం ఉదయం 9గంటల నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్టు స్పష్టం చేశారు.
పలు విద్యుత్ ఎంప్లాయీస్ సంఘాలు, అసోసియేషన్లు సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా టీఆర్వీకేవీ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్, తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్, తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె శశికుమార్ మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేండ్ల కాలంలో అనేకసార్లు వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని, అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, ఏపీఎస్ఈబీ రూల్స్ తక్షణమే అమలు చేయడంతోపాటు గృహజ్యోతి పథకం ద్వారా భారమైన బిల్లింగ్ కార్మికులను ఆదుకోవాలని, పీస్ రేట్ కార్మికులకు 30 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క నాడు సీఎల్పీ నేతగా ఆదిలాబాద్ నుంచి ప్రారంభించిన పాదయాత్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేస్తామని, అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. టీవీఏఈ జేఏసీ ఎన్పీడీసీఎల్ చైర్మన్ సికిందర్, కన్వీనర్లు హెచ్ శ్రీకాంత్, దమ్మ రవీందర్, అటికేటి రవీందర్ ఆధ్వర్యంలో 1104 యూనియన్ సాయిబాబా, 1535 యూనియన్ వజీర్, సీఐటీయూ ఈశ్వర్, టీవీఏఈ జేఏసీ కన్వీర్, కో కన్వీనర్లు సతీశ్‌రెడ్డి, సాయిలు, చంద్రారెడ్డి, శ్రీధర్ గౌడ్, చందర్‌సింగ్, ప్రశాంత్, వెంకన్న పాల్గొన్నారు.
దక్షిణ డిస్కం పరిధిలో ఉద్యోగులు, ఆర్టిజన్లు సమ్మెలో పాల్గొనకూడదని, ఒకవేళ ఎవరైనా పాల్గొంటే వారిపై చర్యలు తీసుకుంటామని సీఎండీ జితేశ్ వీ పాటిల్ హెచ్చరించారు. ఆర్టిజన్లు సమ్మెకు వెళ్లడం వల్ల టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 33/11కేవీ సబ్స్టేషన్లతోపాటు పలు చోట్ల వినియోగదారుల సేవలకు అంతరాయమేర్పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో సంబంధిత సర్కిళ్లకు సంబంధించిన ఉన్నతాధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ ఆదేశాలు జారీ చేశారు.