అందని సాగునీరు, ఆపై కరెంటు కష్టాలు.. అన్నదాతకు అగ్నిపరీక్ష పెడుతున్నాయి. లోవోల్టేజీతో తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండటంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లలో సోమవారం ట్రాన్స్ఫార్మర్ కాలిపోగా.. రైతులే పొలాల మధ్యనుంచి అరకిలోమీటరు వరకు మోసుకుంటూ రిపేరుకు తీసుకెళ్లారు.
మద్దూరు(ధూళిమిట్ట)/నర్మెట, మార్చి 17 : సాగునీళ్ల కోసం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్, ధర్మారం గ్రామాల రైతులు సోమవారం జనగామ జిల్లా నర్మెట మండలం బొమ్మకూర్ పంపుహౌస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దేవాదుల నీటిని నమ్ముకొనే వరి సాగు చేశామని, పొట్ట దశలో ఉన్న పంటలు ఎండిపోతున్నాయని, నీళ్లు రాకపోతే చావే శరణ్యమని రైతులు పేర్కొన్నారు. లద్నూర్ రిజర్వాయర్‌కు బొమ్మకూర్ పంపుహౌస్ ద్వారా ఏటా సాగు నీటిని విడుదల చేసేవారని, దీంతో సాగునీరు అందడంతోపాటు భూగర్భ జలాలు ఉండేవని చెప్పారు.
ఈ సారి నీళ్లు విడుదల చేయకపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే నీటిని విడుదల చేయాలని అధికారులను కోరారు. నిరసనలో లద్నూర్ మాజీ సర్పంచ్ జీడికంటి సుదర్శన్, మాజీ ఎంపీటీసీ గుజ్జుక సమ్మయ్య, కాసర్ల కనుకరాజు, పాకాల ఆదాం, నంద శ్రీనివాస్, పెద్ది శ్రీనివాస్, కాసర్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
రాయపోల్, మార్చి 17 : తలాపున గోదావరి నీళ్లు పారుతున్నప్పటికీ తమ పంట పొలాలకు నీరందక ఎండిపోతున్నాయని మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాల రైతులు సోమవారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ చౌరస్తాలోని రామాయంపేట కెనాల్ వద్ద రోడ్డుపై టెంట్లు వేసుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో గజ్వేల్-చేగుంట ప్రధాన రహదారిలో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పోతన్‌పల్లి, చందాయిపేట, కసాన్పల్లి, పోతంశెట్‌పల్లి, మక్కరాజ్‌పేట, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని మాచిన్పల్లితో పాటు తదితర గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు రోడ్డుపై భైఠాయించారు.
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్‌కు చెందిన రైతు నర్సింహులు ఎకరా పొలంలో వరి సాగు చేశాడు. ఇంకా 20 రోజుల్లో పంట చేతికొస్తుందన్న సమయానికి బోరులో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో నీళ్లందక పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో ఎలాగైనా కాపాడుకోవాలని ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చి పంట పొలాన్ని తడుపుతున్నాడు. ట్రిప్పునకు రూ.500 చెల్లించి.. రోజుకు 4 నుంచి 6 ట్రిప్పుల వరకు ట్యాంకర్ ద్వారా నీటిని పంటకు పారిస్తున్నాడు.
భూగర్భ జలాలు అడుగంటుతుండడం, ఎండలు మండుతుండంతో సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నాలే చేస్తున్నారు. వాటర్ ట్యాంకర్లతో నీళ్లు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కోమట్‌పల్లికి చెందిన రైతు నాయిని బాల్‌రాజ్ ఎకరా విస్తీర్ణంలో దోసకాయ సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం కాత కాసే తరుణంలో బోరు ఎత్తిపోయింది. దీంతో బాల్‌రాజ్ పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నాడు.
మరిపెడ, మార్చి 17: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండధర్మారం, సీతారాంతండాకు చెందిన గుగులోత్ రాజు, గుగులోత్ తిరుపతి, మూడ శ్రీనుకు చెందిన నాలుగు బోరు బావుల్లో నీళ్లు అడుగంటాయి. ముగ్గురు 12 ఎకరాల్లో సాగు చేసిన పంటలు ఎండిపోతుండగా, వాటిని పాడుకునేందుకు ఎక్స్‌వేటర్ సాయంతో ఆకేరు వాగులో పెద్దపెద్ద గుంతులు తీసి మోటర్లతో పంట పొలాలకు నీరు పారించుకుంటున్నారు.
బెజ్జంకి, మార్చి 17: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారంలో ఎండిన వరి పంటలను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోమవారం పరిశీలించారు. చౌడారం నుచిడి వచ్చే కాలువకు మరమ్మతులు చేసి ఉంటే పంట ఎండే పరిస్థితి వచ్చేది కాదన్నారు. చౌడారం నుంచి వచ్చే ప్రధాన కాలువ వద్దకు వెళ్లి గుండారం గ్రామానికి సాగు నీరు అందించే విధానాన్ని పరిశీలించి అధికారులతో ఫోన్లో మాట్లాడగా సానుకూలంగా స్పందించి సాగు నీరు అందిస్తామని తెలిపారు.
గుండాల, మార్చి 17 : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలానికి నవాబ్‌పేట రిజర్వాయర్ నుంచి దేవాదుల కాల్వల ద్వారా సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పోరుబాట పట్టారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి సోమవారం బురుజుబావి గ్రామం నుంచి వెల్మజాల వరకు దేవాదుల కాల్వ వెంట పాదయాత్ర చేశారు. దేవాదుల కాల్వలు, ఎండిన పంటలను పరిశీలిస్తూ మధ్యమధ్యలో రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటి బావులు, బోర్లలో నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయని తెలిపారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో మాట్లాడి గుండాల మండలానికి దేవాదుల కాల్వల ద్వారా సాగునీరు అందించేలా కృషి చేయాలని సూచించారు.
రైతు వెంకటేశంకు చెందిన 2.20 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నా. గత మూడేండ్ల కిందట ఒక బోరు వేశా. అందులో కొద్ది పాటి నీరు రావడంతో కంది, పత్తి, పసుపు తదితర పంటలను సాగు చేశా. కొద్ది రోజుల కిందట బోరుమోటర్ పైపులు తెగి బోరు బావిలోనే పడిపోయాయి. ఎంత ప్రయత్నించినా ఫలితంలేదు. దీంతో 20 రోజుల కిందట ఒకేసారి 620, 550, 500 ఫీట్ల వరకు మూడు బోర్లు తవ్వించా. ఒక్క దానిలోనూ నీళ్లు రాలే. బోరు వేస్తే నీళ్లు వస్తాయన్న ఆశతో పొలంలో డ్రాగన్ ఫ్రూట్స్ వేద్దామని రూ.30 వేలకు డ్రిప్ పరికరాలను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకున్నా. బోర్లు వేయడంతో దాదాపుగా రూ.3 లక్షల వరకు అప్పులయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలి.
పుల్కల్, మార్చి 17: నీళ్లులేక పంటలు ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని సంగారెడ్డి జిల్లా అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. పుల్కల్ మండలం హుమ్లా నాయక్ తండా,లక్ష్మీసాగర్ శివారులో ఎండిన వరి, మొక్క జొన్న పంటలను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జైపాల్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. పక్కనే సింగూరు ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరున్నా సాగునీరు వదలక పోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వనపర్తి, మార్చి 17 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లాలో ఎగువనున్న దొడగుంటపల్లి చెరువు కట్టకు గండి పెడితే నీరు దిగువకు పారుతుందని పెద్దమందడికి చెందిన 20 మంది రైతులు సోమవారం జేసీపీతో వచ్చారు. సమాచారం తెలుసుకున్న దొడగుంటపల్లి రైతులు 50 మంది అక్కడకు చేరుకొని అడ్డుకున్నారు. ఇరిగేషన్ అధికారులు జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది.
రామారెడ్డి, మార్చి 17 : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని పోసానిపేట్ గ్రామానికి చెందిన పోతుల చంద్రయ్య అనే రైతు తనకున్న మూడెకరాల్లో వరి వేశాడు. పంట పొట్టదశకు రాగా..ఎండలు ముదరడంతో బోర్లు ఎత్తిపోయాయి. దీంతో సాగునీరు అందక పంట ఎండిపోతుండటంతో పశువుల మేతకు వదిలేశాడు.