హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): సీఎమ్మార్ విషయంలో పౌరసరఫరాల సంస్థ పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ప్రభుత్వం కేటాయిస్తున్న ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటూ కొందరు మిల్లర్లు ఇతర ప్రాంతాల నుంచి బియ్యం కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై దృష్టిపెట్టిన సంస్థ సీఎమ్మార్‌కు విద్యుత్తు రీడింగ్‌కు లింకు పెట్టాలని భావిస్తున్నది.
మిల్లులు సీఎమ్మార్ ఇచ్చే సమయంలో విద్యుత్తు రీడింగ్‌ను పరిశీలించనున్నారు. ఒకవేళ సీఎమ్మార్‌కు అనుగుణంగా విద్యుత్తు రీడింగ్ ఉండే మిల్లు నుంచే బియ్యం స్వీకరిస్తారు. లేకుంటే ఆ మిల్లుపై విచారణ జరుపుతారు. యాసంగి నుంచే ఈ విధానం అమలుపై పౌరసరఫరాల సంస్థ కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరగడంతో ఎఫ్‌సీఐకి సీఎమ్మాఆర్ ఇవ్వడంపై ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పౌరసరఫరాల సంస్థ జరిపిన విజిలెన్స్ దాడుల్లోనూ అక్రమాలు బయటపడ్డాయి.