200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలుచేసే ప్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌ను చేపట్టాం. ఇందులో భాగంగా విద్యుత్తు వినియోగదారులకు విన్నపం ఏమనగా.. రేపటి నుంచి మీ ఇంటికి కరెంటు బిల్లు తీసేందుకు వచ్చే మీటర్ రీడర్‌కు మీ రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు నంబర్లతోపాటు మొబైల్ నంబర్ చెప్పాలి. ఇందుకు వినియోగదారులు సహకరించాలని మనవి చేస్తున్నాం.
Gruha Jyothi | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గృహజ్యోతి పథకం అమలు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందించేందుకు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను గుర్తించే పనిని విద్యుత్తుశాఖ చేపట్టనున్నది. ప్రతి నెల మొదటి వారం పదిరోజులపాటు మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితోనే లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇంటింటికి వచ్చి కరెంటు మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది ఇంటి యజమానుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు నంబర్లతోపాటు మొబైల్ నంబర్ తీసుకొని రీడింగ్ కోసం తెచ్చిన హ్యాండ్ హెల్త్ మెషిన్లో ఎంటర్ చేయనున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకల్లా దాని సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి, క్షేత్ర స్థాయిలో రీడింగ్ కోసం వెళ్లనున్నారు.
రేషన్‌కార్డు ఉన్న వారికే గృహజ్యోతి పథకం వర్తింప జేసేలా కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు చేపట్టింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం గృహ వినియోగ విద్యుత్తు కనెక్షన్లు 52 లక్షల వరకు ఉంటే అందులో సుమారు 30 లక్షలలోపు వినియోగదారులు 200 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగిస్తున్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 19 లక్షల మంది గృహజ్యోతి పథకం కోసం గ్రేటర్ పరిధిలో దరఖాస్తు చేసుకున్నారు. మిగతావారంతా అద్దెకు ఉంటున్నవారు, సొంతిల్లు లేనివారు ఉన్నారు. గ్రేటర్ పరిధిలో విద్యుత్తు శాఖ లెక్కల ప్రకారం 30 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేయాలంటే ప్రతి నెలా సుమారు రూ.700 కోట్ల వరకు వ్యయం అవుతుంది.
ప్రజల్లో గందరగోళం
గృహజ్యోతి అమలుకు ప్రభుత్వం కచ్చిమై న మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయలేదు. దీంతో ప్రజల్లో అనేక అపోహలు ఏర్పడుతున్నాయి. రేషన్‌కార్డు ఉన్నవారికే గృహజ్యోతి అని అధికారవర్గాలు చెప్తున్నాయి. అయితే, హైదరాబాద్‌లో ఉంటున్న చాలామందికి తమ సొంత ఊర్లలో రేషన్ కార్డులు ఉన్నాయి. వారికి ఉచిత కరెంటు ఎక్కడ ఇస్తారన్నదానిపై స్పష్టత లేదు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా కొన్ని లక్షల మంది కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకొన్నారు. వాటి గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కొత్త కార్డులు ఇస్తారా? ఇవ్వరా? ఇస్తే ఎప్పటిలోగా ఇస్తారు? కార్డుల జారీకి మళ్లీ ఏదైనా కార్యక్రమం చేపడుతారా? ఇప్పటికే సమర్పించిన దరఖాస్తులు సరిపోతాయా? అన్నదానిపై ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి స్పష్టత రావటం లేదు.
ఇప్పుడు గృహజ్యోతి పథకం అమలుచేస్తే ముఖ్యంగా గ్రామాల నుంచి బతుకుదెరువుకోసం వచ్చిన అద్దె ఇండ్లల్లో ఉంటున్నవారి పరిస్థితి ఏమిటన్నదానిపై కూడా స్పష్టత కరువైంది. మరోవైపు హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌తోపాటు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన పనిచేసుకొంటున్నవారున్నారు. వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తారా? లేదా తెలంగాణవారికే ఇస్తారా? అనేదానిపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వటంలేదు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి గృహజ్యోతి పథకంపై ప్రకటన చేస్తారని, అందులో అన్ని వివరాలు ఉంటాయని విద్యుత్తు శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక సందేశం వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారింది.