హైదరాబాద్, అక్టోబర్12 (నమస్తే తెలంగాణ): కృష్ణా బేసిన్లో ఉన్న జలవిద్యుత్తు ప్రాజెక్టులను రివర్‌బోర్డుకు అప్పగించేది లేదని, అవి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంటాయని రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి తేల్చిచెప్పారు. కేఆర్ఎంబీ 15వ బోర్డు మీటింగ్ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన మంగళవారం జలసౌధలో కొనసాగింది. ప్రధానంగా ఈ నెల 14 నుంచి అమలులోకి రావాల్సిన గెజిట్‌పై చర్చించారు. నాగార్జునసాగర్ పరిధిలోని 18, శ్రీశైలం పరిధిలోని 12 ప్రాజెక్టుల పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని కేఆర్ఎంబీ ప్రతిపాదించింది. దీనిపై ఇరు రాష్ర్టాల అభిప్రాయాలను తెలుసుకున్నది.
సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ రాష్ట్ర ప్రభుత్వ వాదనలను బోర్డుకు నొక్కి చెప్పారు. పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యం లో కృష్ణాజలాలకు సంబంధించి తెలంగాణకు వాటా పెరగాల్సి ఉన్నదని, తాత్కాలికంగా చేసిన నీటి కేటాయింపులు సరిపోవడం లేదని స్పష్టంచేశారు. ఇప్పటికే వినియోగంలోకి వచ్చిన నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, కల్వకర్తి ప్రాజెక్టులకు వరద జలాలను మాత్రమే ఇస్తున్నారని, వాటికి నికరజలాలను కేటాయించాల్సి ఉందని నొక్కిచెప్పారు. తెలంగాణకు న్యాయం గా దక్కాల్సిన వాటా ప్రకారం 570 టీఎంసీలను కేటాయించాల్సి ఉందని, దీనిపై ప్రస్తుతం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం వాదనలను వినిపిస్తున్నదని వెల్లడించారు. కొత్త ట్రిబ్యునల్ జలాల కేటాయింపులను పూర్తి చేసేవరకు ప్రస్తుతమున్న 299 టీఎంసీలకు అదనంగా మరో 105 టీఎంసీలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇక బోర్డు పరిధి లో విద్యుత్తు ప్రాజెక్టులు సైతం ఉండాలనడం స మంజసం కాదని, అందు కు ఒప్పుకొనేది లేదని ఖరాకండిగా తేల్చిచెప్పారు. తెలంగాణకు విద్యుత్తు చాలా ముఖ్యమని, ఎత్తిపోతలు, బోరుబావులపై వ్య వసాయరంగం ఆధారపడి ఉన్నదని, ఎప్పుడంటే అ ప్పుడు డిమాండ్ మేరకు విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని వివరించారు. విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులను పూర్తిగా బోర్డు తన ఆధీనంలోకి తీసుకోకుండా, విద్యుత్తు ఉత్పత్తిని ప్రాజెక్టులలో కనీస మట్టాలుగా నిర్ణయించి, అందుకనుగుణంగా చేస్తే బాగుంటుందని సూచించింది. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఆపైనే నిర్ణయాన్ని వెల్లడిస్తామని స్పష్టంచేశారు.
ఇదిలా ఉండగా బోర్డు మీటింగ్‌కు హాజరైన ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి మాత్రం తెలంగాణకు విరుద్ధంగా వాదనలను వినిపించారు. బోర్డు ప్రతిపాదనలను స్వాగతిస్తూనే, జలవిద్యుత్తు ప్రాజెక్టులను సైతం అజమాయిషీలోకి తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. బోర్డు నుంచి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని స్పష్టంచేశారు. ఇరు రాష్ర్టాల అభిప్రాయాలపై బోర్డు సైతం తన అభిప్రాయాలను వెల్లడించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రాజెక్టులను అప్పగిస్తే అక్టోబర్ 14 నుంచి గెజిట్‌ను అమలు చేస్తామని స్పష్టం చేసింది.