Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ (Peddi) పై ప్రేక్షకుల్లో రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి” మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుని ఆడియో ప్లాట్‌ఫామ్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు అందరి దృష్టి సినిమా నుంచి రాబోతున్న సెకండ్ సింగిల్ పై పడింది.ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం సినిమాకు మరింత ప్రత్యేక ఆకర్షణగా మారింది. తాజా సమాచారం ప్రకారం, రెండో పాట ఒక పవర్ఫుల్ ఇంట్రడక్షన్ సాంగ్ గా ఉండనుందని తెలుస్తోంది.
రామ్ చరణ్ పాత్రను గ్రాండ్‌గా ఎలివేట్ చేసే ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అదిరిపోయే స్టెప్పులు డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్‌లో చరణ్ మాస్ ఎనర్జీ, స్టైల్ అభిమానులను అలరిస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ పాట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ సాంగ్ ఖచ్చితంగా ఒక బ్లాస్ట్ లా ఉంటుంది” అంటూ అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపారు. వాస్తవానికి ఈ పాటను డిసెంబర్ చివర్లో విడుదల చేయాలనుకున్నప్పటికీ, పలు కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అధికారిక ప్రకటన ఈ వారంలో వెలువడే అవకాశముందని సినీ వర్గాలు సూచిస్తున్నాయి.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అదేవిధంగా కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు దివ్యేందు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం భావోద్వేగాలు, యాక్షన్, సంగీతం మేళవింపుతో ఉండబోతోందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 30, 2026న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్‌తోనే సినిమాపై భారీ హైప్ ఏర్పడగా, రాబోయే సెకండ్ సింగిల్ ఆ అంచనాలను మరింత పెంచేలా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెగా అభిమానులు ఇప్పుడు ఆఫిషియల్ అనౌన్స్మెంట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.