హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతుల పేరుతో విద్యుత్తు వృథా అవుతున్నదని తెలంగాణ రైతు డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫారూకీ అభిప్రాయపడ్డారు. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్తు చౌర్యానికి గురవుతున్నదని ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రైతుల పేరుతో ఇతరులు ఆ విద్యుత్తును వాడుతున్నారని చెప్పారు. రైతు డిస్కమ్‌కు పంపిణీ లైసెన్స్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) శుక్రవారం బహిరంగ విచారణ చేపట్టింది. ఎర్రగడ్డలోని విద్యత్తు నియంత్రణ భవన్లో నిర్వహించిన ఈ విచారణలో రైతు డిస్కమ్ ఆవశ్యకతను వివరించే ప్రయత్నంలో ముషారఫ్ అనేక వివరాలను బహిర్గతం చేశారు. రాష్ట్రంలోని రైతులు 25 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తు వాడుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. కానీ, ఈ 25 వేల మిలియన్ యూనిట్లు రైతులే వాడుతున్నారా? అన్న అనుమానాలున్నాయని అన్నారు. రైతుల పేరుతో ఉచిత విద్యుత్తును ఇతరులు వాడుతున్నారని, రైతులకు ఇస్తున్న విద్యుత్తు దుర్వినియోగం అవుతున్నదని పేర్కొన్నారు. రైతుల విద్యుత్తును రైతులే వినియోగించుకునేలా కొత్త డిస్కమ్ పనిచేస్తుందని చెప్పారు.
ఇప్పటికీ లో-వోల్టేజీ విద్యుత్తే ఇస్తున్నాం..
దేశ వ్యవసాయ రంగంలో అత్యధిక విద్యత్తు కనెక్షన్లున్న రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని, రాష్ట్రంలోని మొత్తం విద్యుత్తు కనెక్షన్లలలో 1/3వ వంతు వ్యవసాయ కనెక్షన్లేనని ముషారఫ్ వెల్లడించారు. తెలంగాణలో వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు అందడంలేదని, ఇప్పటికీ లో-వోల్టేజీ విద్యుత్తే ఇస్తున్నామని ముషారఫ్ అంగీకరించారు. రాష్ట్రంలోని వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లలో ఏటా 10% కాలిపోతున్నాయని, వాటి స్థానంలో కొత్తవి బిగించడంలో డిస్కమ్‌లు విఫలమయ్యాయని, సకాలంలో ట్రాన్స్ఫార్మర్లను బిగించకలేకపోతున్నాయని అన్నా రు. రాష్ట్రంలో ఏటా విద్యుత్తు షాక్‌లతో దాదాపు 600 మంది మరణిస్తున్నారని, వారిలో రైతులు కూడా ఉంటున్నారని తెలిపారు. వ్యవసాయ విద్యు త్తురంగ సమస్యల పరిష్కారానికి తగిన చొరవ చూపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీవెన్స్ పరిష్కారంలో వ్యవసాయ రంగం రెండో ప్రాధాన్యతగా మారిందని చెప్పారు.
రేటింగ్స్‌లో అథమ స్థానం
దేశవ్యాప్తంగా 54 ప్రభుత్వ రంగ డిస్కమ్‌లలో మన టీజీఎస్పీడీసీఎల్ (దక్షిణ డిస్కమ్) ‘సీ మైనస్’ (C-) రేటింగ్‌తో 52వ స్థానంలో, టీజీఎన్పీడీసీఎల్ (ఉత్తర డిస్కమ్) 54వ స్థానంలో అట్టడుగున ఉన్నాయని, వీటి ఆర్థిక పరిస్థితులు క్షీణించడమే ఇందుకు కారణమని ముషారఫ్ తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలకు 7 నుంచి 7.5% వడ్డీకి రుణాలిస్తుంటే మన డిస్కమ్‌లు 11 నుంచి 12% వడ్డీకి రుణాలు తీసుకోవాల్సి వస్తున్నదని పేర్కొన్నారు.
నష్టాల్లో రెండో స్థానం
రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌లు రూ.69,741 కోట్ల నష్టాలతో దేశంలో రెండో స్థానంలో ఉన్నట్టు ముషారఫ్ ప్రకటించారు. ప్రభుత్వ సంస్థల నుంచి రూ.54,090 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తమిళనాడు రూ.1,19,153 కోట్ల నష్టాలతో అగ్రస్థానంలో ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ట్రాన్స్మిషన్ నష్టాలు 19.8 శాతానికి చేరాయని, సరఫరా చేసిన ప్రతి 100 యూనిట్ల విద్యుత్తులో దాదాపు 80 యూనిట్లకే బిల్లింగ్ అవుతున్నదని చెప్పారు.