హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు ఉద్యోగులు వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(వీఆర్ఎస్) బాట పడుతున్నారు. వీఆర్ఎస్ తీసుకొనేవారి సంఖ్య పెరుగుతుండటంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో విద్యుత్తు ఉద్యోగుల జీతాలను భారీగా తగ్గించారు. బేసిక్ పేలో కోత పెట్టారు. విద్యుత్తు సంస్థల్లో జీతాలు ఎక్కువ ఉన్నాయని ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానించారు. దీంతో ఇక్కడా జీతాలు తగ్గిస్తారన్న అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. పీఆర్సీ వచ్చే పరిస్థితి లేకపోవడం, ఉద్యోగోన్నతులిచ్చే అవకాశాలు కనిపించకపోవడం సైతం కారణంగా తెలుస్తున్నది. ఇటీవలి కాలంలో విద్యుత్తు సంస్థల్లో ఇంజినీర్లు, సిబ్బందికి చీటికిమాటికి మెమోలు ఇస్తున్నారు. ఒకవేళ సస్పెండ్ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్లు అందవు. పింఛన్లు కూడా ఆపేసే ప్రమాదమున్నది. 38 ఏండ్ల సర్వీస్ పూర్తయితే పూర్తి పింఛన్ వస్తుండడంతో చాలామంది వీఆర్ఎస్ తీసుకొనేందుకు సిద్ధపడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఇక విద్యుత్తు సంస్థల ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉన్నది. రైతు డిస్కమ్ ఏర్పాటుతో మిగిలిన డిస్కమ్‌లను ప్రైవేటీకరిస్తారన్న ఆలోచన సైతం వీఆర్ఎస్ తీసుకోవడానికి కారణంగా విద్యుత్తుసౌధ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. సర్కార్‌పై నమ్మకం పోయిందని, ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో వీఆర్ఎస్ తీసుకోవడమే ఉత్తమమని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. జెన్కోలో ఇప్పటికే ఇద్దరు డివిజినల్ ఇంజినీర్లు(డీఈ) వీఆర్ఎస్ తీసుకొన్నారు. దక్షిణ డిస్కమ్‌లో పనిచేసే జహీరాబాద్ డీఈ, ఏడీఈలు సైతం వీఆర్ఎస్ తీసుకొన్నా రు.తాజాగా యాదాద్రి పవర్‌ప్లాంట్(వైటీపీఎస్) స్టేజ్ 1 సీఈ, మరో డీఈ వీఆర్ఎస్ తీసుకోనున్నారు. టీజీ ట్రాన్స్‌కోలో సైతం ఇద్దరు సీనియర్ ఇంజినీర్లు వీఆర్ఎస్ తీసుకోనున్నట్టు సమాచారం. ఉత్తర డిస్కమ్, దక్షిణ డిస్కమ్లోను ఒకరిద్దరు ఇంజినీర్లు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకోనున్నారు. మరికొందరు సైతం వీఆర్ఎస్ పట్ల ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఎక్కువగా 58 ఏండ్లు మించినవారే ఉద్యోగ విరమణకు ఆసక్తి చూపుతున్నారు.