హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : నోటరీ స్థలాల్లోని నిర్మాణాలకు సైతం కరెంటు మీటర్లు ఇవ్వాలని విద్యుత్తు శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు రిజిస్టర్డ్ స్థలాల్లోని నిర్మాణాలకు మాత్రమే విద్యుత్తుశాఖ అధికారులు కొత్త కనెక్షన్లు జారీ చేస్తున్నారు. నోటరీ స్థలాలు, నిర్మాణాలకు కొత్త కనెక్షన్లు ఇచ్చేవారు కాదు. ఇది బ్రోకర్ల పాలిట వరంగా మారింది. విద్యుత్తుశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది, బ్రోకర్లు కుమ్మక్కయ్యి వేలకు వేలు తీసుకుని అక్రమంగా కనెక్షన్లు జారీచేసేవారు. పట్టణాలు, ఇతర ప్రాంతాల్లోని వినియోగదారులు అనివార్య పరిస్థితుల్లో బ్రోకర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. ఒక్కో కనెక్షన్‌కు బ్రోకర్లు రూ.పదివేలకుపైగా వసూలు చేసేవారు. ఇది అవినీతికి దారితీస్తున్నదని గుర్తించిన అధికారులు నోటరీ స్థలాల్లోని ఇండ్లకు సైతం విద్యుత్తు కనెక్షన్లు జారీచేయాలని ఆదేశాలిచ్చారు. ఇప్పటికే దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో నోటరీ స్థలాల్లోని ఇండ్లకు కొత్త విద్యుత్తు కనెక్షన్లు జారీచేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టడంతోపాటు వారికి పదోన్నతులు కల్పించవద్దని ప్రభుత్వానికి సిఫారసు చేసేందుకు జస్టిస్ ఘోష్ కమిషన్ సిద్ధమవుతున్నది. ఈ కమిషన్ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధమున్న పలువురు ఇంజినీర్లను ప్రశ్నించింది. తాజాగా మంగళవారం నుంచి శనివారం వరకు మరికొందరు ఇంజినీర్లు, అకౌంటెంట్లతోపాటు దాదాపు 40 మంది అధికారులను విచారించేందుకు నోటీసులను సిద్ధం చేస్తున్నది. తాము అడిగిన అన్ని డాక్యుమెంట్లను ఇవ్వాలని ప్రభుత్వాన్ని.. ప్లేస్మెంట్ రిజిస్టర్, మెజర్మెంట్ బుక్ ఇవ్వాలని ఇంజినీర్లను ఇప్పటికే ఆదేశించినట్టు తెలుస్తున్నది. మంగళవారం ఆరుగురు ఇంజనీర్లు హాజరకానున్నారు.