హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు అవసరాలు మరింతగా పెరుగుతాయిని, వచ్చే పదేండ్లలో పీక్ విద్యుత్తు డిమాండ్ రెట్టింపు అవుతుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) వెల్లడించింది. ఈ మేరకు స్థాపిత విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచాలని సూచించింది. ప్రస్తుతం పీక్ డిమాండ్ 15వేల మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ ఉండగా, 2034-35 కల్లా అది 31,809 మెగావాట్లకు చేరుతుందని సీఈఏ అంచనా వేసింది. 2027-28లో 20 వేలు, 2030-31లో 25 వేలు, 2033-34లో 30 వేల మెగావాట్లు దాటుతుందని అంచనా వేసింది. ఈ మేరకు ‘రిపోర్ట్ ఆన్ రిసోర్స్ అడిక్వసీ ప్లాన్ ఫర్ ది స్టేట్ తెలంగాణ’ నివేదికను సీఈఏ ఇటీవలే విడుదల చేసింది.
2024-25లో విద్యుత్తు పీక్ డిమాండ్ 16,877 మెగావాట్లు దాటుతుందని సీఈఏ అంచనా వేసింది. ఇలా ఏటా 4 నుంచి 6% చొప్పున డిమాండ్ పెరుగుతుందని స్పష్టంచేసింది. విద్యుత్తు వినియోగం ఏటా 5% చొప్పున పెరుగుతున్నట్టు సంస్థ స్పష్టంచేసింది. విశేషమేంటంటే ప్రతి రెండేండ్లకు 5,000 మెగావాట్ల చొప్పున అధికం కానున్నది. రాబోయే పదేండ్లలో 2,938 మెగావాట్ల విద్యుత్తు పీపీఏ గడువు ముగియనున్నది. దీంతోడిమాండ్ పెరిగి, పీపీఏల గడువు ముగిస్తే విద్యత్తు సమస్య తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి.